లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

As Speaker of Lok Sabha Om Birla– వరుసగా రెండోసారి
– మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండో సారి ఎన్నికయ్యారు. బుధవారం లోక్‌సభలో జరిగిన స్పీకర్‌ ఎన్నిక మూజువాణి ఓటుతో ముగిసింది. తొలుత సభను ప్రారంభించిన ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌ పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎంపీ అధికారి దీపక్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మెహతాబ్‌ మాట్లాడుతూ స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి 17 తీర్మాన నోటీసులు వచ్చాయని, అన్నింటికీ ఆర్డర్‌లో అనుమతిస్తామని అన్నారు. అందులో ఎన్డీఏ నుంచి 14 తీర్మానాలు ప్రవేశపెట్టగా, ఇండియా ఫోరం తరపున మూడు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఎన్డీఏ లోక్‌సభ స్పీకర్‌ అభ్యర్థి ఓం బిర్లా తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బలపరిచారు. కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (జేడీయూ) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని రాజ్‌కుమార్‌ సంగ్వాన్‌ (ఆర్‌ఎల్‌డి) బలపరిచారు. కేంద్ర మంత్రి జితిన్‌ రామ్‌ మంఝీ (హెచ్‌ఎం) తీర్మానం ప్రవేశపెట్టగా, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (బీజేపీ) బలపరిచారు. ఐదో తీర్మానాన్ని కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు. దాన్ని మరో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ బలపరిచారు. ఆరో తీర్మానాన్ని కేంద్ర మంత్రి జాదవ్‌ ప్రతాప్‌రావు గణపతిరావు (శివసేన-షిండే ) ప్రవేశపెట్టగా టట్కారే సునీల్‌ దత్తాత్రేయా (ఎన్‌సీపీ-అజిత్‌ పవర్‌) బలపరిచారు. ఏడో తీర్మానాన్ని కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ (ఎల్‌జెపి) ప్రవేశపెట్టగా, జోయంత బసుమతరీ (యూపీపీఎల్‌) బలపరిచారు. ఎనిమిదో తీర్మానాన్ని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్‌) ప్రవేశపెట్టగా, వల్లభనేని బాలశౌరి (జనసేన) బలపరిచారు. తొమ్మిదో తీర్మానం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు (టీడీపీ) ప్రవేశపెట్టగా, లావు శ్రీ కృష్ణదేవరాయులు (టీడీపీ) బలపరిచారు. పదో తీర్మానాన్ని ఇంద్ర హంగ్‌ సుబ్బా (సిక్కిం కాంత్రికారి మోర్చా) ప్రవేశపెట్టగా, ఫణి భూషణ్‌ చౌదరి (అస్సాం గణ పరిషత్‌) బలపరిచారు. 11వ తీర్మానం కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ (అప్నాదళ్‌) ప్రవేశపెట్టగా, కేంద్రమంత్రి కృష్ణన్‌ పాల్‌ (బీజేపీ) బలపరిచారు. 12వ తీర్మానం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ (బీజేపీి) ప్రవేశపెట్టగా, కేంద్ర మంత్రి జుయల్‌ ఓరం (బీజేపీ) బలపరిచారు.13వ తీర్మానాన్ని ఎస్‌.పి. సింగ్‌ బఘేల్‌ (బీజేపీ) ప్రవేశపెట్టగా, పంకజ్‌ చౌదరి (బీజేపీ) బలపరిచారు. 14వ తీర్మానాన్ని అన్నపూర్ణదేవి (బీజేపీ) ప్రవేశపెట్టగా, కమల్జీత్‌ సెహ్రావత్‌ (బీజేపీ) బలపరిచారు.
ఇండియా ఫోరం అభ్యర్థి కె. సురేష్‌ తరఫున తీర్మానాన్ని అరవింద్‌ గణపత్‌ సావంత్‌ (శివసేన-ఠాక్రే) ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎన్‌కె ప్రేమ్‌ చంద్రన్‌ (ఆర్‌ఎస్పీ) బలపరిచారు. రెండో తీర్మానాన్ని ఆనంద్‌ భదౌరియా (ఎస్పీ) ప్రవేశపెట్టగా, తారిఖ్‌ అన్వర్‌ (కాంగ్రెస్‌) బలపరిచారు. మూడో తీర్మానాన్ని సుప్రియా సులే (ఎన్సీపీ-శరద్‌పవార్‌) ప్రవేశపెట్టగా, కనిమొళి (డీఎంకే) బలపరిచారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌ మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్టు ప్రకటించారు. ఆపైన ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రకటించి ఓం బిర్లా స్పీకర్‌ చైర్‌ను అధిష్టించాలని ఆహ్వానించారు. అయితే కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (జేడీయూ) లేచి డివిజన్‌ (ఓటింగ్‌)కు డిమాండ్‌ చేశారు. అందుకు ప్రొటెం స్పీకర్‌ మెహతాబ్‌ జోక్యం చేసుకుని, ఆ స్టేజ్‌ దాటిపోయామని బదులిచ్చారు. ఓం బిర్లాను స్పీకర్‌ చైర్‌ను అధిష్టించాలని మళ్లీ పిలిచారు.
రాహుల్‌తో మోడీ కరచాలనం
ఓం బిర్లా వద్దకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన వెంట పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు వెళ్లారు. ఓం బిర్లాను ప్రధాని మోడీ కరచాలనం చేసుకొని అభినందనలు తెలిపారు. వెంటనే ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ ఓం బిర్లా వద్దకు వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆ వెంటనే ప్రధాని మోడీకి రాహుల్‌గాంధీ కరచాలనం చేశారు. అనంతరం ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పీకర్‌ స్థానానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే ఉన్న ప్రొటెం స్పీకర్‌ మెహతాబ్‌, ఓం బిర్లాకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకుని అక్కడి నుంచి నిష్క్రమిం చారు. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లాకు ప్రధాని మోడీ, ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అభినందనలు తెలిపి వెనుదిరిగారు. వెంటనే స్పీకర్‌ తన సీట్లో కూర్చున్నారు. వివిధ పార్టీల సభ్యులు స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తరువాత ప్రధాని మోడీ మంత్రులను సభకు పరిచయం చేశారు.

Spread the love