Tuesday, June 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధానికి 
వంద రోజులు

యుద్ధానికి 
వంద రోజులు

- Advertisement -

ముందుకు సాగని శాంతి చర్చలు
ఇంధన సరఫరాలకు కొనసాగుతున్న ఆటంకాలు

ముందుకు సాగని శాంతి చర్చలు
ఇంధన సరఫరాలకు కొనసాగుతున్న ఆటంకాలు

టెహ్రాన్/ వాషింగ్టన్ :
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దళాలు దాడి ప్రారంభించి ఆదివారంతో వంద రోజులు పూర్తయ్యాయి. యుద్ధంలో విజేత ఎవరో ఇంకా తేలలేదు. పైగా పోరు ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియడం లేదు. యుద్ధం కారణంగా అమెరికా వందల బిలియన్ డాలర్లను నష్టపోతోంది. తొలి ఆరు రోజుల యుద్ధానికే అగ్రరాజ్యానికి 11.3 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయని అంచనా. మొత్తంగా చూస్తే 630 బిలియన్ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల వరకూ ఖర్చవుతుందని డెమొక్రాట్లు తెలిపారు. కేవలం ఇంధన వ్యయమే పదుల బిలియన్ డాలర్లు దాటింది. ప్రారంభంలో ఇరాన్, అమెరికాఇజ్రాయిల్ మధ్య మొదలైన పోరు ఆ తర్వాత గల్ఫ్ దేశాలు, లెబనాన్‌కు కూడా విస్తరించింది. చివరికి ప్రపంచ ఇంధన మార్కెట్లను కూడా యుద్ధంలోకి లాగారు. యుద్ధంలో గల్ఫ్ దేశాలు నేరుగా భాగస్వాములు కానప్పటికీ అమెరికాతో ఉన్న స్నేహ సంబంధాల కారణంగా అవి కూడా నష్టపోవాల్సి వస్తోంది. తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్ సైతం ప్రత్యక్షంగా దెబ్బతినాల్సి వచ్చింది. ఈ నెల 3న కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. మన దేశానికి అవసరమైన ఇంధన సరఫరాలలో 6570 శాతం వరకూ హార్ముజ్ జలసంధి మీదుగానే జరగాల్సి ఉండగా యుద్ధం కారణంగా వాటికి తీవ్ర అంతరాయం ఏర్పడి ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి.

కాల్పుల విరమణను పొడిగించి, శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు ముందుకు సాగడం లేదు. అధ్యక్షుడి యుద్ధ అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా ప్రతినిధిసభ ఈ నెల 3న తీర్మానాన్ని ఆమోదించడం డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురు దెబ్బ. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ సేనలు భీకర దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి లెబనాన్‌లో ఇప్పటి వరకూ మూడున్నర వేల మందికి పైగా బలయ్యారు. మరోవైపు లెబనాన్‌లోని హిజ్బుల్లా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇజ్రాయిల్ సరిహద్దును దాటి దాడులు చేస్తోంది.

లెబనాన్ పాత్ర ఏమిటి?
ఇరాన్ యుద్ధంలో లెబనాన్ పోషిస్తున్న పాత్ర తక్కువేమీ కాదు. యుద్ధానికి ముగింపు పలకాలంటే లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు ఆపేయాలని ఇరాన్ షరతు విధిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగినప్పటికీ లెబనాన్‌లోని హ హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ దాడులను ఉధృతం చేస్తోంది. షరతులతో కూడిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హిజ్బుల్లా తిరస్కరించింది. లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ సేనలు పూర్తిగా వైదొలగాలని, దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. లెబనాన్‌లో పరిణామాలకు, అమెరికాతో చర్చల పురోగతికి ఇరాన్ లంకె పెట్టింది. విస్తృత ప్రాంతీయ ఒప్పందం కుదరాలంటే లెబనాన్‌లో కాల్పుల విరమణ తప్పనిసరి అన్నది స్పష్టమవుతోంది. గతంలో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాలు పదే పదే ఉల్లంఘనలకు గురికావడంతో చర్చల ప్రక్రియ మరింత కష్టతరమవుతోంది.

గల్ఫ్ దేశాలపై ప్రభావం
పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయి నప్పటికీ గల్ఫ్ దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. గల్ఫ్‌లోని అమెరికా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేస్తోంది. ఫలితంగా విమానాల రద్దు, దారి మళ్లింపులతో ప్రయాణాలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధితో ముడిపడి ఉన్న వాణిజ్య మార్గాలపై ప్రభావం పడుతోంది. గల్ఫ్ దేశాలపై పడుతున్న ఆర్థిక ప్రభావం మరింత స్పష్టంగా కన్పిస్తోంది. పెరిగిన ఇంధన ధరలు, సరఫరాలలో ఆటంకాలు, మార్కెట్‌లో అనిశ్చితి వంటి పరిణామాలు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెంచాయి. ఇంధన రంగంలో, కొన్ని మౌలిక సదుపాయాలలో జరిగిన నష్టాలను పూడ్చుకోవడానికి అనేక సంవత్సరాలు పట్టవచ్చు.

శాంతి చర్చలకు బ్రేక్
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటి వరకూ జరిగిన చర్చల కారణంగా కేవలం కాల్పుల విరమణ పొడిగింపు మాత్రమే సాధ్యపడింది. ఇరాన్ అణు కార్యక్రమంపై తర్వాతి దశలో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. అయితే ప్రతిపాదిత నిబంధనలలో అమెరికా తరచూ మార్పులు సూచించడం, వైఖరిని పదే పదే మార్చుకోవడంతో చర్చలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. పురోగతి కన్పించడం లేదు. చర్చలు ముందుకు సాగడానికి అమెరికా నుంచి తాము కొన్ని రాయితీలు ఆశిస్తున్నామని ఇరాన్ తెలిపింది. బంతి ఇప్పుడు ట్రంప్ కోర్టులో ఉన్నదని ఓ ఇరాన్ నేత వ్యాఖ్యానించారు. విదేశాలలో స్తంభింపజేసిన తన ఆస్తులను విడుదల చేయాలని, లెబనాన్‌పై aఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను నిలిపివేయాలని కూడా ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇదిలావుండగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ మధ్యప్రాచ్యంతో తిరిగి పరస్పర దాడులు మొదలయ్యాయి.

విజయం తమదేనంటూ ట్రంప్ డాంబికాలు
యుద్ధంలో విజేత ఎవరో ఇంకా తెలియడం లేదు. అయినప్పటికీ తామే గొప్ప విజయాన్ని సాధిస్తున్నామని, అణ్వాయుధాలను తయారు చేసే సామర్ధ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. శాంతి చర్చలలో పురోగతి లేకపోవడాన్ని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్ సేనలు ఇరాన్ సైనిక స్థావరాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి. అదే సమయంలో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. యుద్ధంలో అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలు గణనీయంగానే దెబ్బతిన్నాయి. ఇరాన్ కూడా అనేక బాలిస్టిక్ క్షిపణులలు, డ్రోన్లను కోల్పోయింది.

కనుచూపుమేరలో కానరాని పరిష్కారం
ఘర్షణలు ప్రారంభమైన వంద రోజులు దాటినా పరిష్కారం కనుచూపు మేరలో కన్పించడం లేదు. చర్చలు అనిశ్చితిలో పడ్డాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు పక్షాలు కొన్ని విషయాలలో రాజీ పడాల్సి ఉండగా అందుకు అవి ససేమిరా అంటున్నాయి. సైనిక కార్య కలాపాలు స్వల్పంగానే ఉంటున్న ప్పటికీ ముప్పు మాత్రం అలాగే ఉంది.

బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను కోల్పోయింది
కీలకంగా మారిన హార్ముజ్ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పోరులో హార్ముజ్ జలసంధి ప్రభావం ఎక్కువేనని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇరుకైన జలమార్గం ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకం. సరఫరాలకు ఏ మాత్రం అంతరాయం కలిగినా ఇంధన మార్కెట్లపై తక్షణ ప్రభావం పడుతుంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లకు ముడి చమురు సరఫరాలు బాగా తగ్గిపోయాయి. అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడంతో సంక్షోభం మరింత తీవ్రతరమైంది. షిప్పింగ్ కంపెనీలు అయోమయంలో పడిపోయాయి. చమురు ధరలలో అస్థిరత నెలకొంది. బ్యారల్ ముడి చమురు ధర కొన్ని సందర్భాలలో వంద డాలర్లు దాటింది. అయితే పెరుగుతున్న ఇంధన ధరలపై నెలకొన్న ఆందోళనలను తక్కువ చేసి చూపేందుకు ట్రంప్ ప్రయత్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -