ప్రచారానికి మిగిలింది రెండు రోజులే..

– ఎన్నికలకు ముంచుకొస్తున్న సమయం, జోరుమీదున్న కాంగ్రెస్
– వేగం పెంచుతున్న కారు
– ఇంటింటికీ వెళ్తున్నా పార్టీలు
– ప్రచారంలో బిజీ బిజీ
– మాజీ సీఎం కేసీఆర్ మినహా జిల్లాకు రాని అగ్ర నాయకులు
నవతెలంగాణ – సూర్యాపేట
పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఎంతో దూరంలో లెవ్వు. అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు మరో రెండు రోజులే గడువే ఉంది. ఈ స్వల్ప వ్యవధిలోనే ఓటర్లను ఎంతగా ఆకట్టుకోగలిగితే అంతగా విజయానికి చేరువవుతామని అభ్యర్థులు ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. కీలకమైన ఈ సమయాన్ని  ప్రణాళిక బద్ధంగా సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 13 న పోలింగ్,జూన్ 4 న తేదీన ఓట్ల లెక్కింపు ఉన్నది. చూస్తుండగానే నెలలు, వారాలు గడిచి పోయాయి. రోజుల లెక్కన కౌంట్ డౌన్ మొదలైంది.ఓటింగ్ కు నాలుగు రోజులు ఉండగా ప్రచారానికి మాత్రం రెండు రోజుల గడవు మాత్రమే ఉండడంతో నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బి.ఆర్.యస్,బీజేపీ లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.మిగిలిన రోజులు ఎంతో విలువైందిగా పార్టీలు, అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రతిరోజు తో పాటు ప్రతి గంటను సద్వినియోగం చేసుకునేలా అభ్యర్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. వేకువజామున నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత వరకు ఎన్నికలను ఎలా గెలవాలన్న తపన లోనే ఉంటున్నారు. ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్ది పార్టీల లో అభ్యర్థుల లో గుండె దడ పెరుగుతుంది. ప్రత్యర్థులకు అందనంత వేగంగా వెళ్లేందుకు ప్రచారం జోరును పెంచుతున్నారు. ఈ క్రమంలో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని సూర్యాపేట, కోదాడ,హుజుర్ నగర్,నల్గొండ, మిర్యాలగూడ,నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, బి.ఆర్.యస్ అభ్యర్థి కంచర్ల కృష్ణ రెడ్డి లు ప్రచారాన్ని పెంచారు.ఇక బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి ప్రచారం కేవలం కొన్ని నియోజకవర్గాలకె పరిమితం అయింది.కాగా కాంగ్రెస్, బి.ఆర్.యస్ లు మాత్రం ప్రచారాన్ని పోటాపోటీగా నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి లు అభ్యర్థి గెలుపు కోసం ఆయా ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో బి.ఆర్.యస్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే మాజీమంత్రి గంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో ఒన్ మ్యాన్ షో గా అభ్యర్థుల విజయం కోసం సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు.దీంతో నల్గొండ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బి.ఆర్.యస్ ల మద్య తీవ్ర ప్రచార పోటీ నెలకొంది. ఇక జిల్లాలో చూసుకుంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ,హుజుర్ నగర్ లలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గo లో మాత్రం మాజీమంత్రి దామోదర్ రెడ్డి,ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, సీనియర్ నాయకులు కొప్పుల వేనారెడ్డి లు బైక్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటును అభ్యర్దిస్తున్నారు.మరి ముఖ్యంగా దామోదర్ రెడ్డి వయస్సును కూడా లెక్కచేయకుండా మండే ఎండల్లో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు.ఇదిగాక పట్టణంలో వార్డు కౌన్సిలర్లు, ఇంచార్జిలు కార్యకర్తల సమన్వయంతో ఇంటింటికీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.దామోదర్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ ప్రసంగింస్తున్నారు. అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్నారు. గత ప్రభుత్వ వ్యతిరేక తో పాటు జగదీష్ రెడ్డి లోపాలను దామోదర్ రెడ్డి ప్రచారంలో పేర్కొంటున్నారు. తమ ఓటు బ్యాంకుతో పాటు మైనార్టీ ఓట్లు తమ వైపే ఉన్నాయన్న దిమా వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కూడా తన అనుచరులతో వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇదిలావుండగా ఇప్పటి వరకు పార్టీ పక్షాన నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి భారీ బహిరంగ సభలు, అగ్ర నాయకులు ప్రచారానికి రాని విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ లలో ఒకరిని ప్రచారానికి ఆహ్వానిoచి సభ నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. కానీ అవేవీ కనిపించడం లేదు.అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కూడా లేకపోవడం గమనార్హం.
ఇకపోతే బి.ఆర్.యస్ పార్టీలో మాత్రం అభ్యర్థి కృష్ణ రెడ్డి గెలుపు కోసం మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఆయా నియోజకవర్గ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలను టార్గెట్ చేయడంతో పాటు జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ల పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను ప్రచారంలో భాగస్వామ్యం చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా సూర్యాపేట పట్టణంలో మాత్రం ఇరు పార్టీలు పోటీ పడుతూ ఇంటింటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జగదీష్ రెడ్డి సతీమణి సునీత కూడా మండే ఎండల్లో పార్టీకి చెందిన మహిళా నేతలతో పాటు ముఖ్య నాయకులతో కలిసి పట్టణంలోని వార్డుల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి ల మధ్య నువ్వా నేనా అనే తీరులో గ్రామాలలో ప్రచార పోటి కొనసాగుతుంది. ప్రభుత్వం  వ్యతిరేకతను తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, పింఛన్ల అమలును జగదీశ్ రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. ఇటీవలే మిర్యాలగూడ తో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన కెసిఆర్ బస్సు యాత్ర సభ  సక్సెస్ తో  ప్రచారంలో మరింత జోష్ పెంచారు.ఇక బిజెపి నుండి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈయన ప్రచారం కొన్ని నియోజకవర్గాలకే పరిమితం అయినట్లు కనిపిస్తుంది. ప్రధానంగా సూర్యాపేట లో  మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరావు మాత్రం  తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో భువనగిరి యంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం అధిక శాతం ఇక్కడే ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో నాయకులు అభ్యర్థి మద్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.కాగా  నల్గొండ జిల్లా కేంద్రంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డతో బహిరంగ సభ నిర్వహించి బిజెపి ఎన్నికల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది.కాగా మిగిలిన రెండు రోజులలో  అగ్రనాయకుల ప్రచారాలతో  జిల్లాలో రాజకీయ వేడి మరింత రాజుకొనున్నది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థుల గెలుపు ల కోసం ఆయా పార్టీల అగ్ర నేతలు జిల్లాలో పర్యటిస్తుండడంతో ఎన్నికలకు క్లైమాక్స్ దగ్గర పడుతుంది. అదేవిధంగా ప్రజల మనసులను ఆకట్టుకుని వారి ఓట్లను పొందేందుకు చివరి రెండు రోజులు “మనీ గేమ్” ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన రోజులను సద్వినియోగం చేసుకునేందుకు  అభ్యర్థులతో పాటు వారి మద్దతుదారులు  ముందుకు సాగుతున్నారు.
Spread the love