– నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్ ఢీ నేడు
– మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-హైదరాబాద్
ఐపీఎల్19 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో ఆరంభించాయి. కానీ, ఆ తర్వాత ఇరు జట్ల ప్రయాణం పూర్తి భిన్నంగా సాగింది. సన్‌రైజర్స్ వరుసగా ఐదు విజయాలతో జోరందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ పేలవ ఆరంభం నుంచి కోలుకుని ఇప్పుడే రెండు విజయాలు నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయం వేటలో నైట్‌రైడర్స్… డబుల్ హ్యాట్రిక్ విజయం రేసులో సన్‌రైజర్స్ నేడు ముఖాముఖి తలపడనున్నాయి. సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ నేడు ఉప్పల్ స్టేడియంలో ఢీకొట్టనున్నాయి. మధ్యాహ్నాం 3.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
జోరుమీదున్న ఆరెంజ్ ఆర్మీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ భీకర ఫామ్‌లో ఉంది. ట్రావిశ్ హెడ్ ఫామ్‌లోకి రావటంతో బ్యాటింగ్ లైనప్ ప్రమాదకరంగా మారింది. పాట్ కమిన్స్ రాకతో బౌలింగ్ బృందం బలోపేతమైంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లు గొప్పగా రాణిస్తున్నారు. నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్‌గా అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. యువ ఆటగాళ్లు సలీల్ అరోరా, అనికెత్ వర్మలు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ బంతితో రాణిస్తున్నారు. ఈషన్ మలింగ పదునైన పేస్, స్వింగ్‌తో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. హర్ష్ దూబె, శివాంగ్ కుమార్‌లు తమదైన మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఇటు బంతితో, అటు బ్యాట్‌తో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోన్న సన్‌రైజర్స్ వరుసగా ఆరో విజయంపై కన్నేసి బరిలోకి దిగుతోంది.
కోల్‌కతా విజయాల్లో రింకు సింగ్‌ది కీలక పాత్ర. గత 2 మ్యాచ్‌ల్లో రింకు మెరుపులతో నైట్‌రైడర్స్ గెలుపు రుచి చూసింది. రఘువంశీ, రహానె, కామెరూన్ గ్రీన్ నిలకడగా నిరాశపరుస్తున్నారు. బ్యాటింగ్ లైనప్‌లో రింకు సింగ్‌కు తోడుగా ఒకరిద్దరు రాణించాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వికెట్ల వేటలో మాయ చేయటం నైట్‌రైడర్స్‌కు గొప్ప ఊరట. భీకర సన్‌రైజర్స్ బ్యాటర్లను కోల్‌కతా బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి.



