Saturday, May 23, 2026
E-PAPER
Homeకవితతెలంగాణ జీవద్భాష

తెలంగాణ జీవద్భాష

- Advertisement -

తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిత్వ కెరటమై ఎగిసిన యువతరంగం అడప రాజు. కవిత్వం, కథ తనను నిత్యం చైతన్యవంతంగా వుంచే ప్రక్రియలు. 2011 లో ‘తెలంగాణ సమరశంఖం’ కవితల సంపుటిని తీసుకొచ్చిండు. కథల సంపుటి రావాల్సి వుంది. ఉద్యమంలో తన వంతు క్రియాశీలకమైన పాత్ర గణనీయమైనది. హనుమకొండ జిల్లా, పరకాల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన కవి ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నరు. ‘తెగిన గాలిపటం’, ‘సంఘర్షణ’ వంటి కథలు తనదైన ముద్రను తెలియజేస్తయి. తెలంగాణ జీవద్భాష తన కథలకు అదనపు బలం.

‘మనిషి’ కేంద్రంగా తన కవిత్వ వస్తువులు పరిభ్రమిస్తుంటయి. ”మనిషి – సమాజం” అనే కవితను పరిశీలించినప్పుడు ఒక సూత్రీకరణ ప్రతిపాదనగా ఎత్తుగడ ప్రారంభమైతది. ప్రతిపాదనకు సంబంధించిన పర్యవసనాలు ఎత్తుగడను అనుసరిస్తయి. ప్రతిపాదించిన సూత్రీకరణను నిర్ధారించడం సూఛాయగా కనిపిస్తది. సూఛాయగా నిర్ధారించబడుతున్న సూత్రీకరణకు న్యాయం చేసేలా సమర్థింపు వాక్యాల్ని పురమాయించడం గమనిస్తాం. ఇక్కడ ప్రతిపాదించబడిన సూత్రీకరణ ఏంటో తెలిస్తే మిగతావి సులువుగా అర్థం చేసుకోవచ్చు. నేడు మనిషి మనిషి లెక్క లేడు/ యంత్రం ‘లెక్కయిండు’ అనేది ఒక సూత్రీకరణగా ప్రతిపాదించవచ్చు. యంత్రం లెక్క వున్న మనిషికి సంబంధించిన స్వరూప స్వభావాల్ని కవి ప్రస్తావించడం గమనిస్తాం. ‘అవసరం’ అనే పదాన్ని స్వార్ధానికి ప్రత్యామ్నాయంగా అర్థంచేసుకోవచ్చు. ‘పురాగ నల్లపూసనడం’ వంటి పల్లె పదాలతో మరింత చేరువయ్యేలా వ్యక్తీకరించడం చూడొచ్చు. ఆ తర్వాత స్టాంజాల్లో ఒక పరిష్కారం దిశగా అడుగులు పడడం చూస్తాం. మనిషి ‘మనీషి’గా మారితే తప్ప కొన్ని స్థిరమైన బంధాలు, ఆరోగ్యకర సమాజం ఏర్పడదనే సందేశం అందుతూనే వుంటది.

‘ఇన్స్టాంట్‌ ‘ బాంధవ్యాలు, ప్రేమలు వున్నప్పటికీ, తోటి మనిషిగా చూస్తేనే ప్రేమలు పొంగుతయని చెప్పటంలో; అర్ధం చేసుకోవడంలో కొంత వైరుధ్యత వున్నట్లుగా అనిపిస్తది. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. కవి ముగింపుకొచ్చేసరికి ఒక పరిష్కారాన్ని సూచిస్తూనే ‘ఏమంటరు’ ? అని అడగడంలోని సంశయాత్మకత పాఠకుల్ని సైతం వెంటాడుతుంటది. చివరిగా ‘మానవత్వం పరిమళిస్తేనే సమసమాజం సాక్షాత్కరిస్తుంది’ అనే అల్టిమేట్‌ పరిష్కారం సంశయానికి ముందరే మనల్ని పలకరిస్తది. మనం, అందరం అనే భావనల్ని ఒక భావజాలంగా రూపు కట్టించాలనే తాపత్రయం కనిపిస్తది. ‘నేను’ అహానికి ప్రతిరూపమని, సకల అనర్థాలకు వ¶లమనే పరోక్ష సందేశం వినిపిస్తది.
కవితో పాఠకులు ఏకీభవించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. కవితో పాటుగ పాఠకులు కొనసాగి పోవాలనే నిబంధనలేవీ లేవు. ‘మానవత్వం’ ఈ సమాజంలో ప్రశ్నగా నిలబడి ఎదిరిస్తనే వుంటది. కవులు గుర్తుచేస్తూనే వుంటరు. ఇది ఒక పరంపర. ‘ఆచరణ’ మాత్రమే అధిగమించగలదని ఆశిస్తూ కవికి శుభాకాంక్షలు.

‘మని’షి – సమాజం
నేడు…
మనిషి మనిషి లెక్కలేడు
యంత్రం లెక్కయిండు!
అవసరం ఉన్నప్పుడే అగు పడుతాండు
అవసరం తీరినంక మాయమైతాండు!!
పురాగ నల్లపూసలెక్కయిండు
సూసిన సూడనట్టే పోతాండు
ఏం మాయ రోగమో!!!
అయినా…
నిమిషానికో నయా రోగం పుడుతాంటే
గట్లనే ఐతడు మరి!
ఇదివరలెక్క బంధాలు నిలవాల్నన్న
కొత్తగ కలువాల్నన్న…
ఆయురారోగ్యాలతో మనిషి
ఆరుగాలం గడపాల్నన్న….
మనిషి ‘మనీషి’గా మారాలి
మనం అనుకున్నప్పుడే
మమతలు ఉంటరు
అందరం అన్నప్పుడే
ఆప్యాయతలు పుడతరు
అలై బలాయిలతోనే
అనురాగాలు పెరుగుతరు
ప్రతి ఒక్కరు ఇంకొకరిని ,
తోటి మనిషిగా చూస్తేనే
ప్రేమలు పొంగుతరు
వెరసీ…
విలువలు ఉన్నప్పుడే వ్యవస్థ నడుస్తది
బంధాలు ఉన్నప్పుడే బతుకు పండుతది
మానవత్వం పరిమళిస్తేనే
సమ సమాజం సాక్షాత్కరిస్తుంది!
ఏమంటరు?

  • బండారి రాజ్‌ కుమార్‌, 8919556560
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -