బిల్లులపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించండి

Decision on Bills Order to take– గవర్నర్‌ తన రాజ్యాంగ అధికారాలు, విధులను నిర్వర్తించడంలో విఫలం
– ఏండ్ల తరబడి బిల్లులు పెండింగ్‌
– సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సకాలంలో నిర్ణయం తీసుకునేలా గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను ఆదేశించాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకునేలా గవర్నర్‌ను ఆదేశించాలని కేరళ ప్రభుత్వం తరపున 15వ శాసనసభ ప్రతినిధిగా పేరంప్ర ఎమ్మెల్యే టిపి రామకృష్ణన్‌, స్టాండింగ్‌ కౌన్సిల్‌ సీకే శశి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్‌తో పాటు గవర్నర్‌ అదనపు ప్రధాన కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీలుగా చేర్చారు. ”అసెంబ్లీ ఆమోదించి గవర్నర్‌ పరిశీలనకు పంపిన మొత్తం ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో మూడు బిల్లులు రెండేళ్లకు పైగా ఆయన కార్యాలయంలోనే ఉన్నాయి. మరో మూడు ఏడాదికిపైగా పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్శిటీ ఛాన్సలర్‌గా తొలగించడం పెండింగ్‌ బిల్లుల్లో ఒకటి” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ”గవర్నర్‌ బిల్లులను పరిష్కరించకపోవడం ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ బాధ్యతల ఉల్లంఘనతో సమానం. గవర్నర్‌కు సమర్పించిన ప్రతి బిల్లును నిర్దిష్ట సమయంలో పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రక్రియను పరిగణనలోకి తీసుకుని ప్రజల సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఇతర చట్టాలను అనుసరించి రూపొందించిన బిల్లులను సకాలంలో పరిష్కరించేలా గవర్నర్‌ను ఆదేశించాలి” అని పిటిషన్‌లో కోరారు. గవర్నర్‌ తన రాజ్యాంగ అధికారాలు, విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ముఖ్యమైన బిల్లులపై నిర్ణయాలు తీసుకోవడంలో గవర్నర్‌ అన్యాయంగా జాప్యం చేశారని, కేరళకు తీవ్ర అన్యాయం జరుగుతోందని స్టాండింగ్‌ కౌన్సిల్‌ సీకే శశి సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు. .ప్రజల సంక్షేమం కోసం చట్టసభలు ఆమోదించిన చట్టాల ప్రయోజనాలు ప్రజలకు అందకుండా పోతున్నాయన్నారు. గవర్నర్‌ చర్యలు తీసుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలందరి హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. గవర్నర్‌ పెండింగ్‌లో ఉంచిన ప్రతి బిల్లు కేరళ ప్రజలకు చాలా ముఖ్యమైనదన్నారు.”రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం వీలైనంత త్వరగా బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలి. ‘సాధ్యమైనంత త్వరగా’ అంటే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని వారాల్లో నిర్ణయం తీసుకోవాలి. అయితే, చాలా కాలం పాటు పరిశీలనకు పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా కేరళ గవర్నర్‌ ఈ నిబంధనను ఉల్లంఘించారు. రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించిన గవర్నర్‌ తన రాజ్యాంగ విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పలేము. నిర్ణయం తీసుకోకుండా బిల్లులు నిలుపుదల చేసే అధికారం గవర్నర్‌ కార్యాలయానికి లేదు. రాజ్యాంగానికి అతీతంగా చర్యలు తీసుకునే గవర్నర్‌కు ఆర్టికల్‌ 361 ప్రకారం రక్షణ వర్తించదు. గవర్నర్‌ వైఖరి రాజ్యాంగ పునాదులను బద్దలు కొట్టడంతోపాటు దాని ప్రాథమిక సూత్రాలను తారుమారు చేస్తోంది. గవర్నర్‌ జోక్యం న్యాయ పాలన, ప్రజాస్వామ్య పాలనను ఓడిస్తుంది. బిల్లులను లక్ష్యంగా చేసుకుని సంక్షేమ చర్యల ప్రయోజనాలను కూడా గవర్నర్‌ ప్రజలకు నిరాకరించారని విమర్శించారు. ఈ సందర్భంలో, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన అన్ని బిల్లులపై ఆలస్యం చేయకుండా సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను ఆదేశించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చడంలో గవర్నర్‌ విఫలమయ్యారని ప్రకటించాలి” అని కోరారు.

Spread the love