మంచి చెడు చెప్పే ‘మా బామ్మ కథలు’

Orugallu is the rainbow of children's storiesఇటీవల కాలంలో బాల సాహిత్యానికి ఆదరణ పెరిగింది. అనేక ప్రచురణ సంస్థలు అందమైన బొమ్మలతో పిల్లల పుస్తకాలను ముద్రిస్తూ బాల పాఠకుల చెంతకు చేరుస్తున్నాయి. అటు ప్రభుత్వం ఇటు ప్రచురణ సంస్థలు మాత్రమే కాకుండా బాల సాహిత్య రచయితలు కూడా తమ పుస్తకాలు ముద్రించి పిల్లల చెంతకు చేరుస్తున్నారు. పెద్దల కోసం సాహిత్యాన్ని సృజించిన రచయితలు కూడా బాల సాహిత్య రచనలు చేస్తూ తమ పుస్తకాలను ముద్రిస్తున్నారు. అలాంటి వారిలో కె. విజయేంద్ర ప్రసాద్‌(వియోగి) ఒకరు. వీరి కలం నుండి ఈ మధ్య ‘విద్యార్థి’, ‘చెరపకురా’, ‘దేశభక్తి’ మొదలగు బాలల నవలలు, బాలల కథా సంపుటి వెలువడ్డాయి. వాటిలో ”మా బామ్మ కథలు” ఒకటి. విశాల మరియు వియోగి రాసిన ‘మా బామ్మ కథలు’ పుస్తకంలో 55 కథలున్నాయి. కథలన్నీ పిల్లల భాషలో చక్కగా అర్థమయ్యే విధంగా, ప్రతి కథ నుండి ఒక ప్రయోజనాన్ని పొందే విధంగా రచయిత రాయడం అభినందించదగ్గ విషయం. ‘వలస పిట్ట’ కథలో రంగు, రూపం బట్టి గుణాలను, నైపుణ్యాలను నిర్ణయించకూడదని చక్కగా చెప్పారు. ఎదుటి వారి వేష భాషలను చూసి మోసపోకుండా గుణగణాలు, నైపుణ్యం తెలుసుకోవడం మంచిదని పిల్లలకు సూచించిందీ కథ. ‘స్వార్థం’ కథలో గాడిద, గుర్రం పాత్రల ద్వారా స్వార్థపరుడైన యజమాని మనస్తత్వాన్ని వివరించారు. ‘కుందేలు తెలివి’ కథలో కూడా గద్దకు చిక్కిన కుందేలు పిల్ల, కుందేలు నాయకుడు కూడా సమయోచితంగా మాట్లాడి సమయస్పూర్తితో ప్రవర్తించి తప్పించుకున్న విధానాన్ని రచయిత ఆకట్టుకునేలా రాసి మెప్పించారు. అవెలా మాట్లాడాయో తెలియాలంటే ఆ కథ చదవాల్సిందే. ‘అల్లరి కోతి’ కథ ద్వారా పిల్లలకు చక్కని నీతిని అందించారు రచయిత. శృతి మించిన అల్లరితో జీవితములోని స్వేచ్ఛను కోల్పోయిన కోతిని పిల్లలకు చూపించి ”దేనికైనా హద్దు ఉండాలని, హద్దు దాటితే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని” ముచ్చటగా మందలిస్తారు. ‘బ్రతుకు తీపి’ కథలో ఎద్దు, గాడిద, గుర్రం పాత్రల ద్వారా ”భద్రత కోసం కొంత స్వేచ్ఛను త్యాగం చేయడంలో తప్పులేదని’ చెబుతారు.మిగతా కథలు చదివే పాఠకులకు తప్పక ప్రయోజనం కలుగుతుంది. పుస్తకానికి వేసిన ముఖచిత్రం రంగురంగుల్లో ఆకర్షణీయంగా ఉంది. కథలకు లోపల పేజీలలో బొమ్మలకు బదులు నలుపు తెలుపు ఫోటోలను ముద్రించారు. అందుకు బదులుగా చిత్రకారుడి చేత వేయించిన బొమ్మలను ముద్రించి నట్లయితే కథా సారాంశానికి సరిపడినట్టు ఇమిడిపోయి మరింత ఆకర్షణీయంగా పిల్లల మనసుల్ని దోచుకునేవి.
– నారంశెట్టి ఉమామహేశ్వరరావు

మా బామ్మ కథలు
రచన : విశాల, వియోగి
పేజీలు – 200, వెల : 250 /-
ప్రతులకు:టి.కె.విశాలాక్షి దేవి, కోపల్లె విజయప్రసాద్‌, శ్రీ కృష్ణ పబ్లికేషన్స్‌, 87/468, శ్రీనగర్‌ కాలనీ. బి క్యాంప్‌, కర్నూలు-518 002. ఫోన్‌.7794820104.

Spread the love