ప్రశ్నించే గొంతుల్ని గెలిసించండి

Overcome the nagging voices– బూర్జువా పార్టీల మాయాజాలాన్ని తిప్పికొట్టండి
– వర్షాకాలంలో కప్పల్లా.. పార్టీలు మారుతున్నారు
– మావి రోడ్‌ షోలు కాదు.. పోరుబాటలు
– లాల్‌ జెండా ముద్ద బిడ్డ మల్లు లక్ష్మికి ఓటేయండి : సీపీఐ(ఎం) పాలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌
ప్రజాస్వామ్య వేదికలైన చట్టసభలు ప్రశ్నించే గొంతులు లేక వెలవెలపోతున్నాయి. ధనస్వామ్యంతో ఎన్నికలు తంతుగా మారాయి. ఈ చరిత్రను తిరిగిరాయాలి. పేదల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థుల్ని శాసనసభకు పంపాలి. ఎర్రదండు కదలిక బూర్జువా నేతల వెన్నులో వొణుకు పుట్టించాలి. నిరంకుశ నిజాం మెడలు వంచి, సాయుధ రైతాంగ పోరాటం చేసిన తెలంగాణ గడ్డ నుంచే మార్పుకు శ్రీకారం చుట్టాలి. ఉద్యమాల స్ఫూర్తితో చైతన్యవంతులైన ప్రజలు సీపీఐ(ఎం)ను అక్కున చేర్చుకొని, అండగా నిలవాలి. – బృందాకరత్‌
నవతెలంగాణ-మఠంపల్లి
ఇది రోడ్‌ షో మాత్రమే కాదు.. పోరాటాల షో అని..సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే వానాకాలంలో వచ్చే కొత్తకప్పల్లా కప్పదాట్లు వేస్తూ పూటకో పార్టీ మారుతున్నారని, ఎర్రజెండా పట్టుకున్న కార్యకర్తలు, నాయకులు నికరంగా ఉంటారని అన్నారు. లాల్‌ జెండా ముద్దుబిడ్డ మల్లు లక్ష్మిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు లక్ష్మి గెలుపును కాంక్షిస్తూ మంగళవారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌ షోలో బృందాకరత్‌ పాల్గొన్నారు. ఎర్రజెండాలతో హుజూర్‌నగర్‌ గడ్డ ఎరుపెక్కింది. అడుగడుగునా ప్రజలు బృందాకరత్‌, సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లు లక్ష్మికి అభివాదం చేస్తూ ఉత్సాహం నింపారు. ప్రజలు పూల జల్లు కురిపించారు. ఎన్ని ర్యాలీలు జరిగినా సీపీఐ(ఎం) రోడ్డు షోకు మంచి స్పందన ఉందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పొట్టిశ్రీరాములు సెంటర్‌లో జరిగిన సభలో బృందాకరత్‌ ప్రసంగించారు. ఇది రోడ్‌ షో మాత్రమే కాదు పోరాటాల షో అని చెప్పారు.
ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి గెలవాలని చూస్తున్నారన్నారు. వారికి ఓట్లతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండా ఒక సిద్ధాంతం కోసం, పేదల కోసం పని చేస్తుందని చెప్పారు. తమ పార్టీ పోటీ చేస్తుంది వ్యక్తుల కోసం, పార్టీ కోసం కాదని, పేద ప్రజల కోసమే అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుంది ఒక ఎర్రజెండా మాత్రమే అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌్‌ ఎమ్మెల్యే ప్రజలకు చేసిందేమీలేదన్నారు. మల్లు లక్ష్మిని గెలిపిస్తే ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరూ ఆలోచించి సీపీఐ(ఎం)కు ఓటేసి మల్లు లక్ష్మిని గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌, పార్టీ నాయకులు పారేపల్లి శేఖర్‌ రావు, కొలిశెట్టి యాదగిరి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కోటా గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love