నేడు పాక్‌, కివీస్‌ వార్మప్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌: 2023 ఐసీసీ ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ప్రపంచకప్‌ షురూ కానుండగా.. పది జట్లు నేటి నుంచి ప్రపంచకప్‌ ప్రణాళికల్లో మునిగిపోనున్నాయి. నేడు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ వార్మప్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. న్యూజిలాండ్‌ జట్టు రెండు బృందాలుగా హైదరాబాద్‌కు చేరుకోగా.. పాకిస్థాన్‌ బృందం బుధవారం రాత్రి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో గురువారం ఉదయమే పాకిస్థాన్‌ క్రికెటర్లు ప్రాక్టీస్‌ సెషన్‌కు వచ్చారు. బాబర్‌ ఆజామ్‌ సహా పాక్‌ క్రికెటర్లు అందరూ తొలి ప్రాక్టీస్‌ సెషన్లో చెమటోడ్చారు. రెగ్యులర్‌ కసరత్తులు, ఫీల్డింగ్‌ డ్రిల్స్‌ అనంతరం నెట్స్‌లో సాధన చేశారు. పచ్చదనంతో కనువిందు చేస్తున్న మైదానాన్ని చూసి పాక్‌ కెప్టెన్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌ వాతావరణం, పిచ్‌ స్వభావంపై ఓ అవగాహనకు వచ్చేందుకు పాకిస్థాన్‌ ఆటగాళ్లు తొలి రోజు దృష్టి పెట్టారు. 2015, 2019 ప్రపంచకప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌తో పాకిస్థాన్‌ వార్మప్‌ మ్యాచ్‌ నేడు మధ్యాహ్నాం 2 గంటలకు ఆరంభం కానుంది. భద్రతా ఏర్పాట్ల రీత్యా నేటి వార్మప్‌ మ్యాచ్‌కు అభిమానులను అనుమతించటం లేదు.

Spread the love