డిసెంబర్‌ వస్తే…దడ

డిసెంబర్‌ వస్తే...దడ– కోవిడ్‌-19 కొత్త వేరియంట్‌తో భయం
– పెరుగుతున్న కొత్త కేసులు
– అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
న్యూఢిల్లీ : కోవిడ్‌-19 కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కొత్త ఆందోళనను కలిగిస్తున్నది. దేశంలో కొత్త కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి ఇక దూరమైందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా మహమ్మారి ప్రజల్లో మళ్లీ భయాన్ని పుట్టిస్తున్నది. మరీ ముఖ్యంగా చూస్తే, 2019 నుంచి ఇప్పటి వరకు పలు దశల్లో ఉగ్రరూపం చూపించిన కరోనా తీరును పరిశీలిస్తే.. ప్రతి ఏడాది డిసెంబర్‌ నుంచే కేసులు మొదలవటం, పెద్ద ఎత్తున కేసులు నమోదవటం కనిపించింది. 2019లో ప్రపంచమంతా నూతన సంవత్సరాన్ని జరుపుకోవటానికి సిద్ధమవుతున్నది. అయితే, డిసెంబర్‌లోనే మొదటి కరోనా కేసు చైనాలో నమోదైంది. ఆ తర్వాత దీనికి కోవిడ్‌-19గా నామకరణం చేశారు. అనంతరం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికించింది. లక్షలాది మంది ప్రాణాలను తీసుకున్నది. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రాకాసి కరోనాకు అతలాకుతలం అయ్యాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. అభివృద్ధి క్షీణించింది. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయా యి. ఎట్టకేలకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని (కొన్ని కేసులు నమోదును మినహాయిస్తే) 2022, 2023 ఏడాదుల్లో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు నమోదవుతున్న కరోనా కొత్త వేరియంట్‌ కేసులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ వేరియంట్‌తో అంతగా ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెప్తున్నది. అయినా కూడా కరోనాను తక్కువ అంచనా వేయద్దనీ, ప్రజలంతా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గతంలో ఇలా..
కోవిడ్‌-19 2020 డిసెంబర్‌లో మూడు పెద్ద మ్యుటేషన్‌లను చూసింది. అవి ఆల్ఫా (బి.1.1.7), బీటా (బి.1.351), గామా (పి.1). అలాగే, ఒక సంవత్సరం తర్వాత, 2021 డిసెంబర్‌లో లాక్‌డౌన్‌లు సడలించడం ప్రారంభించిన కొద్ది నెలలకే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని తిరిగి ఇండ్లకే పరిమితం చేసింది. మరుసటి సంవత్సరం, 2022 డిసెంబర్‌లో, కొత్త మేజర్‌ వేరియంట్‌ ఆవిర్భవించి ప్రజలను ఆందోళనకు గురి చేసింది. ఇప్పుడు జేఎన్‌.1 రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ డిసెంబర్‌ నెలలోనే రావటం గమనార్హం.

Spread the love