మేడిపల్లి గ్రామపంచాయతీలో రూ.6 లక్షల ఖర్చులపై అనుమానాలు
సర్పంచ్ భర్త జోక్యంతో నిధుల దుర్వినియోగం జరిగిందని గ్రామస్తుల ఆరోపణలు
జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు.. ప్రత్యేక సాంకేతిక కమిటీతో విచారణ చేపట్టాలని డిమాండ్
నవతెలంగాణ – మహాదేవ్ పూర్ (కాటారం)
మండలం మేడిపల్లి గ్రామపంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగంపై తీవ్ర వివాదం నెలకొంది. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాల్లో గ్రామాభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.6 లక్షల మేర ఖర్చు చేసినట్లు గ్రామపంచాయతీ రికార్డుల్లో నమోదై ఉన్నప్పటికీ, ఆ పనులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
గ్రామపంచాయతీ రికార్డుల ప్రకారం వీధి దీపాల కొనుగోలు, అమరిక, సబ్‌మర్సిబుల్ మోటార్ల మరమ్మతులు, కొత్త మోటార్ల కొనుగోలు, ఫాగింగ్ మిషన్ కొనుగోలు, జంగిల్ క్లియరెన్స్, ట్రాక్టర్ మరమ్మతులు, కార్యాలయ ఫర్నిచర్, నిర్వహణ ఖర్చులు తదితర పనులకు భారీగా నిధులు వెచ్చించినట్లు నమోదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ పనుల్లో చాలా వరకు గ్రామంలో జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
వీధి దీపాల కొనుగోలు, అమరిక పేరిట సుమారు రూ.45 వేల వరకు ఖర్చు చూపించినప్పటికీ, గ్రామంలోని అనేక వీధుల్లో ఇప్పటికీ చీకట్లు నెలకొని ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అదేవిధంగా, మోటార్ల మరమ్మతులకు ఖర్చు చేసిన కొద్ది రోజులకే అదే అవసరానికి కొత్త మోటార్లు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు కావడం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.
జంగిల్ క్లియరెన్స్ పనులకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్లు అధికారిక రికార్డులు చెబుతుండగా, అదే పనులను సర్పంచ్ స్వంత నిధులతో నిర్వహించినట్లు స్థానికంగా ప్రచారం జరగడం వల్ల అసలు పనులు ఏ నిధులతో జరిగాయనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
అంతేకాకుండా, గ్రామపంచాయతీ పరిపాలనలో సర్పంచ్ భర్త ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటూ నిధుల వినియోగం, పనుల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ అంశాలను గ్రామసభలోనూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీలో జరిగిన అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్లు, టెక్నికల్ సాంక్షన్లు, వర్క్ ఆర్డర్లు, మెజర్‌మెంట్ బుక్స్ (ఎంబీలు), జీఎస్టీ బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, బ్యాంకు లావాదేవీలు, పనుల ఫొటోలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని గ్రామస్తులు కోరారు. జిల్లా స్థాయి ప్రత్యేక సాంకేతిక కమిటీతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు, బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.
పంచాయతీ నిధులు పక్కదారి..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



