వారం రోజుల్లో… పీసీసీ మార్పు మంత్రివర్గ విస్తరణ

Within a week... PCC change cabinet expansion– కాంగ్రెస్‌ తరపున గెలిచిన వాళ్లకే మంత్రివర్గంలో చోటు
– మూడు రోజుల్లో రుణమాఫీ గైడ్‌లైన్స్‌…
– మండలాలు, జిల్లాల డి లిమిటేషన్‌పై త్వరలో కమిటీ
– బీసీ కమిషన్‌ సభ్యుల నియామకం తర్వాత కులగణన
– ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌ రెడ్డి
– కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆషాడం ప్రారంభంలోపు పీసీసీ చీఫ్‌ మార్పు, మంత్రి వర్గ విస్తరణ చేపట్టేలా పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ బీ ఫాంపై గెలిచిన వాళ్లకే మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు తన మంత్రి వర్గంలో చోటు ఉండదని సంకేతాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపికపై చర్చలు ప్రారంభమయ్యాయని, పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారన్నారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. వరుసగా రెండో రోజు మీడియాతో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ పీసీసీ చీఫ్‌గా రెండు ఎన్నికలు పూర్తి చేశానని, జులైౖ 7తో మూడేండ్లు పూర్తి కానుందని తెలిపారు. కొత్త పీసీసీ చీఫ్‌ నియామకం, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్‌ డిసైడ్‌ చేస్తుందన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంలో సామాజిక న్యాయం పాటిస్తామన్నారు. పీసీసీ రేసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా, ఈడబ్ల్యూఎస్‌లకు చెందిన నేతలు ఉండవచ్చన్నారు. మహిళలకు పీసీసీ ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు, ఈ నిర్ణయం బాగానే ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మహిళను పీసీసీ చీఫ్‌గా నియమించ లేదన్నారు.
మూడు రోజుల్లో రైతు రుణమాఫీ మార్గదర్శకాలు
మూడు రోజుల్లో ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల లోపు రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రుణమాఫీ అని స్పష్టం చేశారు. ఒక కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. పంట రుణాల మాఫీకి రేషన్‌ కార్డు ప్రామాణికం కాదన్నారు. రేషన్‌కార్డును కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రైతు రుణమాఫీ తరువాత రైతు బంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామని చెప్పారు.
ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌
ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను తీసుకురానున్నట్టు సీఎం చెప్పారు. ధరణిని తొలగించే స్టడీ జరుగుతుందన్నారు. ఇప్పటికే ధరణిపై కమిటీ వేశామన్నారు. ధరణిలో ఉన్న లోపాలు, ఆ లోపాలను సరిదిద్దేందుకు పని చేస్తున్నట్టు చెప్పారు. సమాజం ఉన్నంత సేపు అవినీతి ఉంటుందని, ఆ అవినీతిని నిరోధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ధనవంతులకు రూ. 25 వేల కోట్లు చెల్లించారు
బీఆర్‌ఎస్‌ సర్కార్‌ విడుదల చేసిన రూ. 75 వేల కోట్ల రైతు బంధు నిధుల్లో… రూ. 25 వేల కోట్లు ధనవంతులకే చేరాయని సీఎం అన్నారు. నాలాలు, రోడ్ల కోసం చేసిన భూసేకరణ స్థలాలకు, ధనవంతుల నిర్మించుకున్న ఇండ్ల లే అవుట్లకు, టాటా, బిర్లాలకు ఈ నిధులు చేరాయన్నారు. అయితే ప్రస్తుతం రైతుబంధు తమకు ప్రాధాన్యత కాదన్నారు.
అడ్మినిస్ట్రేషన్‌లో రూల్స్‌ బ్రేక్‌ చేయను
ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పోస్టింగ్స్‌లో రూల్స్‌ బ్రేక్‌ చేయదల్చుకోలేదని రేవంత్‌ అన్నారు. ఆ అధికారాలు తమకు ఉన్నా… కేసీఆర్‌ చేసిన తప్పులు, తాను చేయ్యబోనన్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లలో బెస్ట్‌ ఆఫీసర్లతో పాలనను సక్రమంగా కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వానికి కీలకమైంది జిల్లాలని… ఆ జిల్లాలకు సామర్థ్యం కలిగిన కలెక్టర్లు, ఎస్పీలను ఇటీవల కేటాయించినట్టు చెప్పారు. అడ్మినిస్ట్రేషన్‌లో తన మార్క్‌ అవసరం లేదని… రాష్ట్ర అభివృద్ధిలో రేవంత్‌ మార్క్‌ చూపిస్తానన్నారు. కొందరు కోరుకుంటున్నట్లు మార్క్‌ కోసం వెళ్తే… తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లేలోగా పలువురు ఆఫీసర్లు సెక్రటేరియట్‌ను కూడా మాయం చేస్తారన్నారు.
చాలా రాష్ట్రాల్లో ఫిరాయింపులు
ఫిరాయింపులకు తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించారన్నారు. ఏపీలో నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీ విలీనం చేసుకుందని గుర్తు చేశారు. అస్సాంలో ఏకంగా పార్టీ ఎంపీలందరినీ బీజేపీలో కలుపుకున్నారని చెప్పారు. పాత బస్తీలో విద్యుత్‌ క్రమబద్ధీకరణ ప్రాజెక్ట్‌ను అదానీకి ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెప్పారు. అయితే..మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అదానీకి కారు చౌకగా కట్టబెట్టడాన్ని రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. అయితే… రాష్ట్రంలో అదానీనీ పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నామన్నారు. అదానీతో పాటు ఇతర విద్యుత్‌ కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరిపాయని వెల్లడించారు.
ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదు
పేదలకు అందిస్తోన్న ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదని సీఎం అన్నారు. అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలని… చూసే వారిని బట్టి దీనికోణం ఉంటుందన్నారు. మోడీ 10 ఏండ్లలో 16 లక్షల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరు ప్రశ్నించలేదన్నారు. కానీ మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుబడుతున్నారని ఫైర్‌ అయ్యారు. గత అప్పులను పక్కన పెడితే… ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ భవిష్యత్‌ లో లాభాల బాటపట్టనుందన్నారు. ఉచిత ప్రయాణంతో 30 మందితో కూడిన ఆక్యూపెన్సీ… 80 శాతానికి పెరిగిందన్నారు. ఉచిత బస్సు టికెట్లకు ప్రతినెలా రూ. 300 నుంచి రూ. 350 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుందన్నారు. మహిళలు పుణ్య క్షేత్రాలను సందర్శించడంతో దేవాలయాల హుండీ ఆదాయం పెరిగిందన్నారు. అక్కడ జీఎస్టీ కూడా పెరిగిందన్నారు.
వాస్తవ అంచనాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఉంటా యన్నారు. వాస్తవ అంచనాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని సీఎం వెల్లడించారు. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలకు మించి బడ్జెట్‌ ఉండకూడదని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. బడ్జెట్‌ వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను తాము పక్కకు పెట్టినట్లు చెప్పారు. తెలంగాణా రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని… వాటి ఇంట్రస్ట్‌ల్లో ఏమాత్రం తగ్గినా ప్రతి యేటా వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. వరంగల్‌, ఆదిలాబాద్‌లో ఎయిర్‌ పోర్ట్‌లు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఎయిర్‌ పోర్ట్‌ల ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారుతుందన్నారు.
మండలాలు, జిల్లాలపై డిలిమిటేషన్‌ కమిటీ వేస్తాం
రాష్ట్రంలో జిల్లాలను, మండలాలను తగ్గించే, పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. అయితే మండలాలు, జిల్లాల హేతుబద్దీకరణపై డిలిమిటేషన్‌పై కమిటీ వేయనున్నట్లు చెప్పారు. జనాభా, విస్తీర్ణం, మౌలిక వసతులు వంటి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా… ఎలాపడితే అలా మండలాలు, తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చారన్నారు. ఎన్టీఆర్‌ టైంలో మండలాల ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే… మరో జిల్లాల్లో కోటి జనాభా ఉందన్నారు. అసలు టోటల్‌ సిస్టంపై స్టడీ జరగలేదన్నారు.
కొత్త సభ్యుల నియామకం తర్వాతే కులగణన
ప్రస్తుత బీసీ కమిషన్‌లోని సభ్యుల కాలపరిమితి ఆగస్టుతో ముగియనుందని సీఎం తెలిపారు. అందువల్ల కొత్త సభ్యుల నియామకం తర్వాతే బీసీ కులగణన చేపడతామని స్పష్టం చేశారు. రైతు భరోసా, ఇతర కమిషన్లపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తెరవెనక ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఏదైనా అసెంబ్లీలో చర్చించి… రాజ్యాంగం కల్పించిన 51 శాతం ఆమోదంతో నిర్ణయాలు ఉంటాయన్నారు.
ఒక శాతం వడ్డీ తగ్గినా నెలకు రూ.700 కోట్ల భారం తగ్గుదల
కాళేశ్వరానికి సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందుకు తెస్తామని సీఎం చెప్పారు. చర్చల తరువాత డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళతామన్నారు. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. మరో లక్ష కోట్ల వరకు పెండింగ్‌ బైల్స్‌ ఉన్నాయని చెప్పారు. నెలకు రూ.7 వేల కోట్ల అప్పులు కడుతున్నా మన్నారు. దాదాపు 7 శాతం-11 శాతం వడ్డీ వరకు రుణాలు తెచ్చారన్నారు. అవకాశం ఉన్నంత వరకు వడ్డీ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలు తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నామని, ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సంప్రదింపులు చేసే ప్రయత్నంలో ఉన్నామని అన్నారు. ఒక శాతం వడ్డీ తగ్గినా నెలకు రూ. 700 కోట్ల భారం తగ్గుతుందని చెప్పారు. కేంద్రంతో చర్చలు జరిపి రుణాలకు వడ్డీ తగ్గించే అంశం ఒక కొలిక్కి తీసుకువస్తామన్నారు. అవసరమైతే తక్కువ వడ్డీకి ఇచ్చే వారి నుంచి డబ్బు తీసుకుని… ఎక్కువ వడ్డీకి డబ్బు తెచ్చిన అప్పులు తీర్చేస్తామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించినట్టు చెప్పారు.
కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారగా తాజాగా చేవెళ్ల నుంచి గెలిచిన కాలె యాదయ్య కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం నాడిక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డితో పాటు దీపాదాస్‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. యాదయ్య చేరికతో బీఆర్‌ఎస్‌ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 71కి పెరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాదయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఆయన, ఆ తరువాత బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన యాదయ్య, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 268 ఓట్ల తేడాతో బయటపడ్డారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన భీమ్‌ భరత్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు.

Spread the love