‘సంసద్ మార్చ్’ సందర్భంగా గాయపడిన షేక్ ఇర్షాద్‌కు మూడు గంటల శస్త్రచికిత్స
పెల్లెట్ గన్ వాడలేదన్న ఢిల్లీ పోలీసులు
ముఖం, మెడపై పెల్లెట్ తూటాలను తలపించే గాయాలు
న్యూఢిల్లీ : నీట్ వ్యవహారంపై సీజేపీ చేపట్టిన ‘సంసద్ మార్చ్’ సందర్భంగా పోలీసుల చర్యల్లో తీవ్రంగా గాయపడిన షేక్ ఇర్షాద్ మన్సూరీ (25) ఘటన కొత్త వివాదానికి దారితీసింది. ఆయన ముఖం, మెడపై పెల్లెట్ తూటాలలాగా కనిపిస్తున్న గాయాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు మాత్రం పెల్లెట్ గన్‌లను ఉపయోగించ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలు ఢిల్లీ పోలీసులపై కాకుండా, నిరసనల నియంత్రణకు మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్)పై వస్తుండటం గమనార్హం.
ఈ నెల 20న నిర్వహించిన ‘సంసద్ మార్చ్’ సందర్భంగా గాయపడిన షేక్ ఇర్షాద్ మన్సూరీకి మంగళవారం ఢిల్లీలోని లేడీ హార్డింజ్ ఆస్పత్రిలో మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన ముఖం, మెడపై చిన్నచిన్న లోహపు గుండ్లతో తగిలినట్టుగా కనిపిస్తున్న గాయాలు ఉండటంతో పెల్లెట్ గన్ లేదా అలాంటి ఆయుధం వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురుగ్రామ్‌లో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్న ఇర్షాద్.. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో తొలిసారిగా పాల్గొన్నట్టు ఆయన స్నేహితుడు తెలిపాడు. శస్త్రచికిత్సకు ముందు వైద్యులు తనకు ఒక పత్రంపై సంతకం చేయించారనీ, ఆపరేషన్ సమయంలో ఇర్షాద్ చూపు కోల్పోయే ప్రమాదం ఉందనీ, అందుకు వైద్యులను బాధ్యులను చేయరాదని అందులో పేర్కొన్నట్టు ఆయన వెల్లడించాడు. ముఖ్యంగా కంటి కింద, గొంతు వద్ద ఉన్న రెండు గాయాలు అత్యంత తీవ్రంగా ఉన్నాయని వైద్యులు చెప్పినట్టు తెలిపాడు.
అయితే గాయాలకు కారణమైన ఆయుధంపై ఆస్పత్రి వైద్యులు తమకు ఎలాంటి లిఖితపూర్వక సమాచారమూ ఇవ్వలేదని, మౌఖికంగా కూడా చాలా పరిమిత వివరాలే వెల్లడించారని ఇర్షాద్ స్నేహితుడు చెప్పాడు. కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో తాము ఉన్న సమయంలో సుమారు 40 నుంచి 50 మీటర్ల దూరంలో నిలబడి ఉన్న ఆర్‌ఏఎఫ్ జవాను కాల్పులు జరపడంతో ఇర్షాద్ గాయపడ్డాడని ఆయన స్నేహితుడు ఆరోపించాడు. తమకు తెలిసినంతవరకు అలాంటి ఆయుధంతో మరెవరూ గాయపడినట్టు కనిపించలేదని కూడా చెప్పాడు.
నిరసనలను నియంత్రించడం కోసం కేంద్ర రిజర్వ్ పోలీసు బలగం (సీఆర్‌పీఎఫ్) పరిధిలోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను అక్కడ మోహరించారు. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా లేడీ హార్డింజ్ ఆస్పత్రిని సందర్శించి గాయపడిన నిరసనకారులను పరామర్శించారు. ఆ సమయంలో ఇర్షాద్‌ను కూడా ఆయన కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను పలు వార్తా సంస్థలు విడుదల చేశాయి. అయితే అందులో ఆడియో లేకపోవడంతో వారి మధ్య జరిగిన సంభాషణ బయటకు రాలేదు. అలాగే ఇర్షాద్ ముఖంపై ఉన్న గాయాలు స్పష్టంగా కనిపించకుండా వీడియో ఉండటం గమనార్హం. ఆ సమయంలో నడ్డా.. ఇర్షాద్‌కు పండ్ల బుట్ట అందజేసి ‘అన్నీ బాగానే అవుతాయి’ అని ధైర్యం చెప్పారని ఆయన స్నేహితుడు వివరించాడు. గాయాలు ఎలా అయ్యాయని మంత్రి అడగగా.. నిరసనల్లో పాల్గొన్న సమయంలో పోలీసులు లక్ష్యంగా చేసుకోవడంతో గాయపడ్డానని ఇర్షాద్ చెప్పాడని తెలిపాడు. విద్యా రంగంలో, యువత సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే అసంతృప్తితోనే తాను నిరసనల్లో పాల్టొన్నానని కూడా ఇర్షాద్ కేంద్ర మంత్రికి చెప్పినట్టు ఆయన స్నేహితుడు వివరించాడు.
నిరసనల రోజే ఇర్షాద్ ఫొటోను విడుదల చేస్తూ సీజేపీ.. పెల్లెట్ గన్‌లు ఉపయోగించారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు వెంటనే ఖండించారు. అలాంటి వార్తలు పూర్తిగా అసత్యమని న్యూఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. బుధవారం కూడా ఢిల్లీ పోలీసులు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అయితే పెల్లెట్ గన్ వాడారన్న ఆరోపణలు ఢిల్లీ పోలీసులపై కాకుండా, ఆర్‌ఏఎఫ్ సిబ్బందిపై వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఆర్‌ఏఎఫ్ కానీ, సీఆర్‌పీఎఫ్ కానీ ఈ ఆరోపణలపై ప్రత్యేకంగా స్పందించలేదు.
చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యుల హెచ్చరిక
పెల్లెట్ తూటాలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



