ప్రజానుకూల పద్దు కావాలి…

 Sampadakiyam‘షెడ్డులో సగం.. గుడిలో సగం…’ ఆదిలాబాద్‌ జిల్లా దుబ్బగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిని వివరిస్తూ పత్రికల్లో తాజాగా వచ్చిన కథనానికి శీర్షిక ఇది. ‘ప్రసవానికి డోలీలోనే…’ భద్రాచలం మారుమూల అటవీ ప్రాంతంలో గర్భిణీలు, బాలింతల పరిస్థితిపై వచ్చిన మరో కథనమిది. అత్యంత కీలకమైన విద్యా, వైద్య రంగాలపై పాలకుల నిర్లక్ష్యానికి ఇవి ప్రబల తార్కాణాలు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఈ రెండు రంగాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా… వాటి విడుదల, తద్వారా పథకాల అమల్లో మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవటం శోచనీయం. గత బీఆర్‌ఎస్‌, ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సైతం ‘చేసింది గోరంత-చెప్పుకునేది కొండంత’ అనే విధంగానే వ్యవహరిస్తున్నాయి తప్పితే ఆచరణలో చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదు. గత దశాబ్ద కాలంగా వైద్య విద్య, ఫుడ్‌ సేఫ్టీ, మాదక ద్రవ్యాల విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయంటూ ఇటీవల నిర్వహించిన బడ్జెట్‌ ప్రతిపాదిత సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వాపోయారు.. కానీ గత ఏడాది కాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సర్కారు, ఆయా రంగాలను ఎందుకు ప్రక్షాళన చేయలేదు, వాటికి చాలినన్ని నిధులు ఎందుకు కేటాయించలేదన్నది ప్రశ్నార్థకం.
మరోవైపు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనుల కోసం ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక నిధుల విషయంలోనూ పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటం ఆందోళనకరం. బీఆర్‌ఎస్‌ హయాంలో సంబంధింత నిధుల వ్యయం ఎప్పుడూ 70 శాతాన్ని దాటలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా ముఫ్పై శాతం నిధులను కేసీఆర్‌ సర్కారు ఇతర పనులకు వినియోగించిందన్న విమర్శలకు అప్పటి ప్రభుత్వం ఇప్పటిదాకా జవాబివ్వకపోవటం గమనార్హం. 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కారు సైతం అదే బాటలో నడిచి, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసింది. 2023-24లో ప్రతిపాదించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పేర్కొన్న నిధుల్లో 77శాతాన్ని ఖర్చు చేసి, మిగతా 23 శాతాన్ని వదిలేసింది. 2024-25 బడ్జెట్‌లో ఇప్పటి వరకూ 48 శాతం నిధులను ఖర్చు చేశారు. అయితే ప్రస్తుత పద్దుకు మార్చి ఆఖరు వరకూ గడువుంది కాబట్టి, అప్పటి వరకూ ఎంత వ్యయం చేశారనే లెక్కలు తేలాల్సి ఉంది.
పరిస్థితి ఈ విధంగా ఉండగా… మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాధాన్యతల గురించి సర్కారు ఆలోచించి, తదనుగుణంగా ముందుకెళ్లాలి. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకూ విద్యారంగంలో అన్ని స్థాయిల్లోనూ సమూల మార్పులు తెస్తా మంటున్న రేవంత్‌ సర్కారు…అందుకోసం అవసరమైన నిధులను కేటాయించాలి. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి రూ.ఐదు వేల కోట్లు కేటాయించాలంటూ సీపీఐ(ఎం) ఇటీవల విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ఆ కోవలోనే ఇతర రంగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన బడ్జెట్‌ను ప్రతిపాదించాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు వీలుగా బడ్జెట్‌ కూర్పు ఉండాలి.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు, వాటిని చెల్లించేందుకు తిప్పల గురించి ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన కాంగ్రెస్‌ సర్కారు… ఇక ఇప్పుడు తప్పించుకోవటానికి వీల్లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘ప్రభుత్వ ఉద్యోగులం దరికీ ఒకటో తారీఖునే జీతాలు…’ అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మారింది.
ప్రభుత్వఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సిబ్బందికి రావాల్సిన గ్రాట్యూటీ, ఇతర బెనిఫిట్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన ఈఎల్స్‌ డబ్బులు తదితరాలు రూ.వందల కోట్ల మేర పేరుకు పోవటంతో ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు ఏం చేయాలో తెలియని దుస్థితి. వాటి కోసం నెలలు, ఏండ్లు ఎదురు చూసిన బాధితులు సహనం కోల్పోతున్న పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం బడ్జెట్‌. అది ప్రజానుకూలంగా ఉంటే ప్రభుత్వం సేఫ్‌. లేదంటే మళ్లీ ధర్నాచౌక్‌ దద్దరిల్లటం ఖాయం.

Spread the love