ప్రజలు పునరాలోచనలో పడ్డారు…

– మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామా? అని ప్రజలు పునరాలోచనలో పడ్డారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టీ.రామారావు అధ్యక్షతన మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన తప్పుడు హామీలతో ప్రజలు మోసపోయారనీ, అందుకే తమ కండ్లను తామే పొడుచుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. కళ్యాణలక్ష్మి పాత చెక్కులనే ఇప్పుడు కూడా ఇస్తున్నారనీ, అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ఆయన ప్రశ్నించారు. రైతుబంధు స్థానంలో రైతు భరోసా ఏమైందంటూ శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీల కంటే బీఆర్‌ఎస్‌ ఎంపీలే ఎక్కువ ప్రశ్నలు వేశారని తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి లోక్‌సభ అభ్యర్థులను కేసీఆర్‌ ఖరారు చేస్తారనీ, సన్నాహక సమావేశాలు ముగిశాక తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారని చెప్పారు. తమది క్రమశిక్షణ గల పార్టీ అనీ, పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడాల్సిందేనని స్పష్టం చేశారు.

Spread the love