ప్రజలు ఓడిపోరాదు!

ప్రజలు ఓడిపోరాదు!‘చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారు…’ అన్నాడో కవి. ఎన్నికల సందర్భంలో సీటు రాదని తెలిస్తేనో, మరొకందుకో నాయకులు పార్టీలు మారటం కద్దు. ఇప్పుడిది రాష్ట్రంలో మరింత జోరందుకుంది. వారు రోజుకో కండువా కప్పుకుంటున్నారు సరే..చేర్చుకుంటున్న పార్టీల బుద్ధి ఎటుపోతోంది…? రాజకీయమంటే అధికారం ఎక్కడుంటే అక్కడుండటం, తమ తమ వ్యాపారాలు, పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపకాలను సజావుగా నడుపుకోవటమేనా..? వీటన్నింటికీ అధికారమే కేంద్రమా..? అలా అయితే ఓట్లేసిన ప్రజలు ఓడిపోతారు కదా..?
పదేండ్లపాటు తెలంగాణను ఏలిన గులాబీ పార్టీ… రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా చేయాలనే కుట్రతో ఫిరాయింపులను యధేచ్ఛగా ప్రోత్సహించింది. కాంగ్రెస్‌, బీజేపీ మొదలుకుని చిన్నాచితకా పార్టీల వరకూ నేతలందర్నీ చేర్చుకుని బాగా ‘వాచింది’. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ జమానాలో ‘గులాబీ వనాన్ని’ మొత్తానికి మొత్తంగా ఖతం పట్టించేందుకు ప్రయత్నిస్తే… ‘చీరి చింతకడ్తం..ఖబర్దార్‌ రాజశేఖరరెడ్డి…’ అని కేసీఆర్‌ గర్జించారు. అదే కారు సారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన గర్జనను తీసి గూట్లో పెట్టి, ఫిరాయింపుల ద్వారా ఇతర పార్టీల నోట్లో మట్టికొట్టారు. పదేండ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. ఇప్పుడు సీన్‌ రివర్సయింది. అప్పటి గులాబీ దళపతి మాదిరిగానే ఇప్పటి హస్తం సారథి వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ముప్పిరిగొంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా (రైతుబంధు) నిధులను విడుదల చేసి…అన్నదాతలను ఆదుకోవాల్సిన సర్కారు, ఇప్పుడు దానిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొంగొత్త రాగం ఎత్తుకుంది. ఎలక్షన్లలో ఎకరానికి, ఒక పంటకు రూ.7,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ కాంగ్రెస్‌ ప్రకటిస్తే… దానికి జనం ఆమోదముద్ర వేశారు. గులాబీ పార్టీని ఓడించటం ద్వారా హస్తాన్ని గద్దెనెక్కిస్తున్నామంటూ వారు తమ అభిప్రాయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. ఇదంతా జరిగాక ఇప్పుడు రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ ఏంటో? పెట్టుబడిదారుల షేర్‌ మార్కెట్ల కోసం మొన్నటిదాకా ‘ముందుగానే నైరుతి…’ అంటూ కార్పొరేట్‌ మీడియా ఊదరగొట్టింది. ఇప్పుడు వానల్లేక విలవిల్లాడుతున్న రైతులను పాలకులు పట్టించుకుంటారా? తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేసిన పత్తి విత్తనాలు, సరైన పదును లేకపోవటంతో మొలకెత్తలేదు. దీంతో మళ్లీ విత్తనాలను కొనుగోలు చేసి, విత్తాల్సిన దుస్థితి. నీట్‌ పరీక్షలో తలెత్తిన అవకతవకలతో రాష్ట్రానికి చెందిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారినా… దానిపై రేవంత్‌ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనేదీ వెలువడకపోవటం ఆశ్చర్యకరం.
లక్షలాది మంది కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల జీవోల విడుదల అగమ్యగోచరంగా మారింది. విడిఏను బేసిక్‌లో కలిపి అదే కొత్త జీతమని చెప్పి కార్మికుల చెవుల్లో పూలు పెడ్తున్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలనీ, అందుకనుగుణంగా తమ డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించాలని కోరుతున్న జూనియర్‌ డాక్టర్లే ఒక అడుగు వెనక్కి తగ్గి తమ ఆందోళనను ముగించారు. వీటితోపాటు ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైన ఆసరా పింఛన్ల పెంపు, మహిళలకు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక చేయూత, కౌలు రైతులకూ రైతు భరోసా తదితరాంశాల గురించి ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పటం లేదు. ఈ హామీలను అమలు చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం పదేండ్లపాటు తెలంగాణపై వివక్ష కొనసాగించి నిధులు, గ్రాంట్లు, ఇతర ఆర్థిక సాయాలకు అడ్డుకట్ట వేసిన కేంద్రం నుంచి వాటిని రాబట్టాలి. అవి రావాలంటే గత కేసీఆర్‌ మాదిరిగా విజ్ఞాపనలు, వినతిపత్రాలకే పరిమితమైతే సరిపోదు. రాష్ట్ర ప్రయోజనాలు, ఆర్థిక వనరులు, హక్కుల కోసం రేవంత్‌ సర్కార్‌ మోడీ ముందు తన గొంతు పెంచాలి.
వీటన్నింటినీ పక్కనబెట్టి ఫిరాయింఫులు, చేరికలను ప్రోత్సహించటమే పనిగా అధికార పార్టీ బిజీబిజీ అయిపోయింది. అలకపాన్పెక్కిన జీవన్‌రెడ్డి లాంటి సీనియర్లను బుజ్జగించే పనిలో డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు తలమునకలై ఉన్నారు. ‘ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తాం…’ అంటూ మొన్నటి ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్‌…తాను రాసుకున్న ‘వేద వాక్కులకు’ తానే చెల్లుచీటి ఇవ్వటం ఆ పార్టీ విలువలకు నిదర్శనం. ఆ మాటకొస్తే అసలు ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచిందే కాంగ్రెస్‌. ఏతావాతా తేలేదేమంటే…ఇబ్బడిముబ్బడిగా ఫిరాయింపులు పెరిగి, ప్రతిపక్షాలు బలహీనపడితే…అది అంతిమంగా రాష్ట్రానికి, ప్రజలకు తీరని నష్టం. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయటమే దానికి విరుగుడు.

Spread the love