ప్రజల బ్యాంకా..బీజేపీ బ్యాంకా..?

People's Bank..BJP's Bank..?– సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న ఎస్‌బీఐ
– ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలి :రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌బీఐ బ్రాంచీల ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
– బ్యాంకు మేనేజర్లకు వినతులు
నవతెలంగాణ-సిటీబ్యూరో / సుల్తాన్‌బజార్‌/విలేకరులు
”రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌బీఐ ధిక్కరిస్తోంది. ప్రజల బ్యాంకుగా కాకుండా బీజేపీ బ్యాంకుగా వ్యవహరిస్తోంది.. అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్‌బీఐని కూడా పెట్టుకుంది.. మోడీ తప్పులను.. బీజేపీ అవినీతిని కప్పి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు” అంటూ సీపీఐ(ఎం) నేతలు విమర్శించారు. ఎస్‌బీఐ చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఆ పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నరసన కార్యక్రమాలు చేపట్టారు. బ్యాంకు మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు.హైదరాబాద్‌లోని గన్‌ ఫౌండ్రీ ఎస్‌బీఐ కార్యాలయం ముందు ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, డిజి.నర్సింహారావు ప్రసంగించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అవినీతిని కాపాడేందుకు బాండ్ల వివరాలు దాచిపెడుతున్నారని అన్నారు. బీజేపీకి వివిధ సంస్థలతోపాటు అనేక మార్గాల్లో వచ్చిన బాండ్ల వివరాలు, లెక్కలు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఎస్‌బీఐ బ్యాంక్‌ను కోరినా ఇవ్వకుండా వాటిని దాచిపెడుతోందని విమర్శించారు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా ట్రాన్స్‌ఫర్‌ అవుతున్న లెక్కలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌లో క్లియర్‌గా ఉంటాయని, వాటి వివరాలు ఇవ్వడం కోసం ఎస్‌బీఐ నాలుగు నెలల సమయం కోరడం సరైంది కాదన్నారు. సాధారణ ప్రజలు, కార్మికులు, రైతులకు సంబంధించిన వివరాలు మాత్రం వెంటనే వస్తాయని, క్షణాల్లో వారిపై చర్య దిగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీజేపీకి సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు అడిగినా ఎస్‌బీఐ చైర్మెన్‌ ఇవ్వడం లేదని తెలిపారు. ఎస్‌బీఐ బ్యాంక్‌ ప్రజల బ్యాంకు తప్ప మోడీ బ్యాంక్‌ కాదన్నారు. ఇప్పటికైనా వెంటనే ఎస్‌బీఐ చైర్మెన్‌ ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని, ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బి.ప్రసాద్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌, సీపీఐ(ఎం) నేతలు పాల్గొన్నారు.
ఖమ్మంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రం అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్‌ మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎస్‌బీఐ ఎదుట నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇల్లందులో సీపీఐ(ఎం), పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఎస్‌బీఐ బ్యాంక్‌ను ముట్టడించారు. కార్యాలయంలోనికి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. జూలూరుపాడు, కల్లూరులో ర్యాలీగా ఎస్‌బీఐ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.
ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లా కేంద్రాలతోపాటు ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఎస్‌బీఐల ముందు ధర్నా చేపట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం ఎస్‌బీఐ బేఖాతరు చేయడం క్షమించరాని నేరమని నేతలు అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల ఎస్‌బీఐ బ్యాంక్‌ ఎదుట నిరసన తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పరిగి ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. తుర్కయంజాల్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ ముందు ప్లకార్డులు ప్రదర్శించారు. బ్యాంక్‌ మేనేజర్‌కు మెమోరాండం అందజేశారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రాల్లో, నారాయణపేట జిల్లా దామరగిద్ద ఎస్‌బీఐ బ్యాంకు ముందు ధర్నా చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని ఎస్‌బీఐ బ్రాంచీల ఎదుట సీపీఐ(ఎం) నేతలు నిరసన కార్యక్రమాలు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఎస్‌బీఐ విఫలమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్‌, నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎలక్టోరల్‌ బాండ్లను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తూ నల్లగొండలోని క్లాక్‌ టవర్‌ ఎస్‌బీఐ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఎలక్టోరల్‌(ఎన్నికల) బాండ్లను రద్దు చేస్తూ, వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. రాజీవ్‌ చౌక్‌ వద్ద ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌ వద్ద ధర్నా చేశారు.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి మాట్లాడారు. నూతనకల్‌ మండలంలో ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట ధర్నా అనంతరం బ్రాంచి మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట పట్టణంలోని ఏపూరు బస్టాండ్‌ సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బీబీనగర్‌ స్థానిక ఎస్‌బీఐ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు.

Spread the love