– అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – బల్మూరు
తెలంగాణ పోరాట ప్రారంభంలోనే ప్రజా ఉద్యమ నాయకుడుగా అచ్చంపేట నియోజకవర్గం గోదల్ గ్రామానికి చెందిన సామ మాణిక్ బాబు చురుకైన పాత్ర పోషించాడని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మాణిక్ బాబు అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి మరణించడంతో ఆదివారం ఆయన గ్రామానికి వచ్చి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన అనంతరం గ్రామ సర్పంచిగా పనిచేశారని ఆయన మృతి ఈ ప్రాంతానికి గ్రామానికి తీరని లోటని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశాడని ఆయన గుర్తు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థిక సహాయం అందించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకుడు సామ మాణిక్ బాబు అని కొనియాడారు. దళిత సమాజం అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మరణం గోదల్ గ్రామానికే కాకుండా ప్రజా ఉద్యమాలకు, దళిత సమాజానికి తీరని లోటని అన్నారు. మాణిక్ బాబు సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో పాటు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాణిక్ బాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని సామ మాణిక్ బాబుకు ఘనంగా నివాళులర్పించారు.



