జిల్లా ఉద్యాన అధికారికి ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ వినతి..

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలు సంస్థ అధికారులు అలసత్వం,స్థానికి ఉద్యాన అధికారుల నిర్లక్ష్యం,కాంట్రాక్టర్ ల నిర్వహణ లోపంతో బ్రష్టు బట్టి పోతున్నాయని,వీటిని సంస్కరించి ఆయిల్ ఫాం సాగు దారులకు మేలు చేసే విధంగా, ఆయిల్ ఫెడ్, ప్రభుత్వం ఖజానాకు నష్టం జరక్కుండా చర్యలు చేపట్టాలని ఉద్యాన, పెట్టు పరిశ్రమ శాఖల జిల్లా అధికారి సూర్యనారాయణ కు మంగళవారం తన కార్యాలయంలో  తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గోవర్స్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు వినతి పత్రం అందజేసారు.
ఈ వినతి పత్రం యధాతధంగా…
శ్రీయుత గౌరవనీయులైన భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా ఉద్యాన,పట్టు పరిశ్రమ అధికారి శ్రీ సూర్యనారాయణ గారి దివ్యసముఖము నకు, అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ సొసైటీ రైతులు నమస్కరించి వ్రాసుకొను విన్నపము.
విషయము : భ్రష్టు పట్టి పోయిన ఆయిల్ ఫాం నర్సరీ వ్యవస్థ,మొక్కల పంపిణీ. సబ్సిడీ చెల్లింపులు తదితర అంశములు పై చర్యల కై వినతి.
ఆయిల్ పామ్ హబ్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డి.హెచ్.ఎస్.ఒ గా బాధ్యతలు స్వీకరించిన తమకు హార్దిక స్వాగతం పలుకుతూ.. గతంలో ఈ జిల్లాలో పనిచేసిన తమకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన వుంది. వేగంగా విస్తరిస్తున్న ఆయిల్ ఫామ్ సాగులో అత్యంత కీలకమైన నర్సరీ విభాగం పూర్తిగా భ్రష్టు బట్టి పోయింది. నాణ్యతలేని విత్తన దిగుమతులు,అవగాహన, అర్హతలేని అధికారులు మొక్కల పెంపకంలో ఎటువంటి అనుభవం లేని కాంట్రాక్టర్లు, బాధ్యతలు మరచిన పై అధికారుల ఉత్తుత్తి పరిశీలనలు,క్వారెంటైన్ సర్టిఫికెట్ల జారీ,స్థల సామర్థ్యానికి మించి మొక్కల పెంపకం,కొంతమంది అధికారుల చేతివాటం,రైతులలో కొరవడిన అవగాహన,ఆయిల్ పామ్ గెలలు రేటు పెరిగిన దశలో చూపిన ఆసక్తి, తగ్గిన దశలో ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపకపోవడం అనేక సంక్లిష్ట అంశాలతో పాటు ఆయిల్ ఫెడ్ లో కొంతమంది అధికారుల అత్యుత్సాహం,అవినీతి కారణంగా ఈ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
         అందులో ప్రధాన భూమిక పోషించాల్సిన ‘ఉద్యాన శాఖ’ అధికారులు నిర్లిప్తంగా ఉండిపోయారు. కావున ఈ జిల్లాలో ఉన్న సంక్లిష్ట అంశాలపై విశేష అనుభవం వున్న మీరు ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి,రైతులకు దీర్ఘకాలం అధిక దిగుబడికి భరోసా ఇచ్చే నాణ్యమైన మొక్కలను అందుబాటులో వుంచడానికి తగు చర్యలు తీసుకోవల్సిందిగా కోరుతున్నాము. భూ రికార్డుల పరంగా ప్రత్యేక పరిస్థితులు వున్న ఈ జిల్లాలో మొక్కల కోసం దరఖాస్తు చేసిన రైతులకు మొక్కల పంపిణీ, ప్రోత్సాహక సబ్సిడీ, బిందు సేద్యం ఇతర ప్రభుత్వ రాయితీల విషయంలో రికార్డుల పరంగా వెసులుబాటును కల్పించి గ్రామ సభలో ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్,అగ్రికల్చర్ అధికారుల జాయింట్ సర్వే ద్వారా రైతులను గుర్తించి రైతులకు మొక్కలు అందజేయాలి.జిల్లాలో అనేకమంది రైతులు బిందు సేద్యం కొరకు దరఖాస్తు చేసి,మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు అట్టి వారికి తక్షణమే తగు మంజూరు ఇప్పించగలరని కోరుచున్నాము.
          ఆయిల్ పామ్ సాగుచేసిన రైతులకు నాలుగు సంవత్సరాల (2020 – 2021, 2022 – 2023) ప్రోత్సాహక సబ్సిడీ అందరికి అందలేదు. వారందరికీ సబ్సిడీ బకాయిలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ఈ జిల్లాలో గత నాలుగు సంవత్సరములుగా పంపిణీ చేసిన మొక్కలలో 30% పైగా మొక్కలు ప్రక్క రాష్ట్రాలకు తరలి వెళ్లినట్లు గా ఆరోపణలు వున్నవి.పంపిణీ చేసిన విస్తీర్ణం కు వాస్తవంగా సాగు చేసిన విస్తీర్ణం కు మధ్య చాలా వ్యత్యాసము వున్నట్లు ఆరోపణలు వున్నవి.వీటి పై సమగ్ర విచారణ చేసి, ప్రభుత్వ / ఆయిల్ ఫెడ్ నిధులు దుర్వినియోగం కాకుండా అర్హులైన రైతులకు మాత్రమే మొక్కలు,సబ్సిడీలు అందే విధంగా చర్యలు తీసుకో గలరని కోరుచున్నాము.
Spread the love