– కాంగ్రెస్ నేతలకు నోటీసులు, ఎన్నికల సమయంలో ట్యాపింగ్ అంశాలపై విచారణ
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కామారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు పిలిచింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సైబర్ టవర్స్‌లోని సిట్ కార్యాలయంలో హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు . గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలను సిట్ అధికారులు ప్రశ్నించగా, వివిధ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుడు గంప ప్రసాద్‌కు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, లక్క పత్తిని గంగాధర్, వడ్ల సురేష్, టింకు భరత్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేఖల సమావేశంలో మాట్లాడారు.



