నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌలు డిమాండ్ చేశారు. సోమవారం ఉపాధి కూలీల ఫోటో క్యాప్చర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల వద్ద ఫోటో క్యాప్చర్ సరిగా లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కారణంగా పలువురు కూలీలు పనులు కోల్పోతుండగా ఉపాధి హామీ చట్టంలో తీసుకొచ్చిన మార్పులను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఫోటో క్యాప్చర్ సమస్యల వల్ల అనేక గ్రామాల్లో 10 నుంచి 20 మంది వరకు కూలీలు పనులు చేయలేక తిరిగి వెళ్తున్నారని తెలిపారు. నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పనులు కేటాయించడం వల్ల మండుటెండలో నడిచి వెళ్లి తిరిగి రావడం కూలీలకు భారంగా మారిందన్నారు. గ్రామ పంచాయతీలు,అధికారులు ఆయా గ్రామాల్లో వాహనాల ద్వారా కూలీలను పని ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, చాలా చోట్ల అవి అమలు కావడం లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు నీటి క్యాన్లతో సరిపెడుతున్నారని, కూలీల సంఖ్యకు అనుగుణంగా తాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పని సమయంలో కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఉపాధి కూలీలకు రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పథకంలో పాత విధానాన్ని కొనసాగించడం వల్ల కూలీలకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.



