విద్యుత్‌ నిర్వహణ పనులకు ప్రణాళిక

– వేసవి డిమాండ్‌ తట్టుకొనేందుకే… : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫరూఖీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వేసవిలో అధిక విద్యుత్‌ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో నిర్వహణ పనులు చేపడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. మంగళవారం నాడిక్కడి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు సమాచారం ఇస్తూ, నిర్ణీత సమయంలో నిర్వహణ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం చేపట్టే నిర్వహణ పనుల జాబితాను విడుదల చేశారు. కరెంటు వైర్లపై ఉన్న చెట్ల కొమ్మల్ని కొట్టేసే పనుల్ని ఆయా ప్రాంతాల్లో కేవలం రెండు గంటల్లో పూర్తిచేయాలంటూ టైం షెడ్యూల్‌ నిర్ణయించారు. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఫీడర్ల మరమ్మత్తు పనుల నిర్వహణకూ సమయాన్ని నిర్దేశించారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు కలిగే అంతరాయాలపై విద్యుత్‌ వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రకటించిన సమయంలోపు మరమ్మతులు, నిర్వహణ పనులు పనులు పూర్తి చేయాలనీ, ఆలస్యమైతే దానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఆయా పనులకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆ వివరాలన్నీ సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్‌ (ఆపరేషన్‌) జే శ్రీనివాసరెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ సీజీఎం, ఎస్‌ఈలు పాల్గొన్నారు.

Spread the love