Thursday, May 14, 2026
E-PAPER
Homeజిల్లాలువేసవిలో దుక్కి దున్నిస్తే.. లాభం రైతుకే

వేసవిలో దుక్కి దున్నిస్తే.. లాభం రైతుకే

- Advertisement -

– భూమి సారవంతం పెరిగే అవకాశం
– దీర్ఘకాలిక లాభాలను అందించే చర్య
– వానపాముల పెరుగుదలతో మరింత ప్రయోజనం
– చీడపీడల నివారణ జరిగి పెట్టుబడి తగ్గే అవకాశం
– వేసవిలో దుక్కి దున్నించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మండుటేసవిలో భూములను దుక్కి దున్నించడం ద్వారా భూమికి బలం చేకూరి రైతులకు అధిక లాభాలు తెచ్చిపెట్టే అవకాశముంది. ఈ ప్రక్రియ రైతులకు దీర్ఘకాలిక లాభాలను అందించే కీలక వ్యవసాయ యాజమాన్య చర్యగా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పంటల కోత పూర్తికాగానే భూములను పెద్ద నాగళ్లతో దున్నించడం ద్వారా భూమిలో క్రిమికీటకాల గుడ్ల, లార్వాలు ఎండలకు నశించిపోతాయి. అదే సమయంలో మట్టిని తింటూ భూములను సారవంతం చేసే వానపాముల సంఖ్య (రైతులకు వ్యవసాయంలో సహజ మిత్రులు అనే పేరుంది) పెరుగుతుంది. వానపాముల సంతతి పెరిగి నేల మరింత గుల్లగా మారుతుంది. వానపాములు భూమిలో సహజంగా సొరంగాలు తయారు చేయడం వల్ల నీరు, గాలి సులభంగా లోనికి చేరి భూసారం పెరగడానికి సహాయపడుతుంది. దీని ద్వారా ఎరువుల వాడకం తగ్గుతుంది. ఫలితంగా రైతులకు పంట పెట్టుబడి తగ్గే అవకాశముంది
.
వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నవివే..
వేసవి దుక్కుల వల్ల నేల గట్టిపడిన పొరలు పగిలి గాలి ప్రసరణ మెరుగుపడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. భూమిలోని పోషకాలు సమానంగా కలవడంతో మొక్కల వేర్లు లోతుగా పెరిగి పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి. వేసవి ఎండ తీవ్రత కారణంగా నేలలో దాగి ఉండే హానికర పురుగుల గుడ్లు, లార్వాలు, కోశస్థ దశలు బయటకు వచ్చి ఎండకు నశిస్తాయి. పక్షులు వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల సహజ నియంత్రణ జరుగుతుంది. దీంతో పురుగుమందుల వినియోగం గణనీయంగా తగ్గుతుంది.

అలాగే ఎండు తెగుళ్లు, వేరు కుళ్లు వంటి వ్యాధులకు కారణమయ్యే శిలీంధ్ర బీజాలు అధిక ఉష్ణోగ్రతల వల్ల నశించి పంట కాలంలో వ్యాధుల తీవ్రత తగ్గుతుంది. చీడపీడల ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంది. వేసవి దుక్కుల వల్ల భూమిలోని పంట అవశేషాలు, ఎండు గడ్డి తదితరాలు మట్టిలో కలిసిపోయి క్రమంగా సేంద్రియ కర్భన పదార్థంగ మారతాయి. దీనివల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం మెరుగుపడుతుంది. మిత్ర సూక్ష్మజీవుల వద్ధికి కూడా ఇది అనుకూల పరిస్థితులు కల్పిస్తుంది. వేసవి దుక్కుల వల్ల భూమిలో గాలి ప్రసరణ, తేమ నిల్వ, సేంద్రియ పదార్థాల కలయిక మెరుగుపడటంతో వానపాములకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

నీటియాజమాన్యంలో మెరుగు ఇలా..
నీటి యాజమాన్యంలో కూడా వేసవి దుక్కులు కీలక పాత్ర పోషిస్తాయి. దుక్కి చేసిన భూమి గుల్ల బారడం వలన తొలి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించుకుంటుంది. దీనివల్ల భూమిలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉండి వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంట నిలబడే అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా ఈ పద్ధతి రైతులకు మేలు చేస్తుంది. కలుపు నివారణ, పురుగుమందుల ఖర్చులు తగ్గడం వల్ల రైతులకు ఖర్చు ఆదా అవుతుంది. అదనంగా దిగుబడి పెరగడం ద్వారా మరింత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

వేసవి దుక్కులతో ప్రయోజనాలు ఇలా…?
-నేల గుల్లబారి వేర్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
-కలుపు మొక్కలు, పురుగుల గుడ్లు, లార్వాల సహజ నియంత్రణ జరుగుతుంది.
-నేలలో సేంద్రియ కర్బనం, మిత్ర సూక్ష్మజీవుల పెరుగుదలతో రైతులకు మేలు జరుగుతుంది.
-పంట భూమిలో వర్షపు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదల అవుతుంది.
-సాగు ఖర్చు వ్యయం తగ్గే అవకాశముంటుంది.
-పంట దిగుబడి పెరిగే అవకాశాలు మరింత మెరుగు పడతాయి.

భూమి ఆరోగ్యాన్ని కాపాడే దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడాలి
పంట కోత పూర్తయిన వెంటనే భూమిలో స్వల్ప తేమ ఉన్నప్పుడు దుక్కులు చేయాలి. భూమిని వీలైనంత లోతుగా దున్నడం ఉత్తమం. వీలైతే భూమిని ఏటవాలుగా దున్నించాలి. అలా చేస్తే వర్షపు నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకుతుంది. దుక్కుల అనంతరం పంట అవశేషాలు భూమిలో కలపడం ద్వారా సేంద్రియ కర్బనం పెరుగు తుంది. వేసవి దుక్కులను వ్యవసాయ పనిగా కాకుండా భూమి ఆరోగ్యాన్ని కాపాడే దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిం చాలి. ఈ పద్ధతి పాటించడం ద్వారా భూసారం పెరగడం తో పాటు సాగు ఖర్చు తగ్గి లాభసాటి వ్యవసాయం సాధ్యమవుతుంది.
డాక్టర్‌ బి.గోపి, తెలంగాణ వ్యవసాయ శాఖ సంచాలకులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -