భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
సామాన్యులు కొనడం గగనమే
3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు!
న్యూఢిల్లీ: ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. దేశంలో బంగారం, వెండి దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచే ఈ పెంపు అమలులోకి రావడంతో మధ్యతరగతి ప్రజల బంగారు కల మరింత భారంగా మారింది. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ క్రమంలో భారత్ విదేశీ మారక నిల్వలు హరించుకుపోకుండా కాపాడుకోవడం, వాణిజ్య లోటును తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోనే విలువైన లోహాల వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. తాజా సుంకాల పెంపు వల్ల దేశీయంగా వీటి ధరలు పెరిగి, డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు
దేశ ప్రయోజనాల దృష్ట్యా భారతీయులందరూ కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ఇటీవల మోడీ విజ్ఞప్తి చేశారు. దీనిపై అభరణాల వర్తక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలన్న సూచనలతో దేశవ్యాప్తంగా నగల రంగంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 3.5 కోట్ల మంది ఉపాధిని దెబ్బతీస్తాయని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఎఐజెజిఎఫ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ధరల పెంపు వల్ల డిమాండ్ పడిపోయి, షోరూం సిబ్బందితో పాటు నగలు తయారు చేసే స్వర్ణకారులు రోడ్డున పడే ప్రమాదం ఉందని పేర్కొంది. కేవలం దిగుమతులపై ఆంక్షలు విధించడం లేదా ప్రజలను కొనవద్దని కోరడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఎఐజెజిఎఫ్ అభిప్రాయపడింది. దీనికి బదులుగా ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించింది. భారతీయుల ఇళ్లలో, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న టన్నుల కొద్దీ బంగారాన్ని ప్రభుత్వం సమీకరించాలి. దీనివల్ల అటు విదేశీ మారక ద్రవ్య సమస్య తీరడంతో పాటు ఇటు నగల రంగం సంక్షోభంలో పడకుండా ఉంటుందని ఫెడరేషన్ వివరించింది.
సామాన్యుల ఆశలపై నీళ్లు..
ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోడీ చేసిన విజ్ఞప్తికి తోడు.. తాజా పన్ను పెంపు దేశీయ మార్కెట్‌లో ధరలను అమాంతం పెంచేసింది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టులా మారింది. ప్రభుత్వం విదేశీ మారక నిల్వలను కాపాడటంపై దృష్టి పెట్టిన్నప్పటికీ సామాన్యుడి అవసరాలను, ఈ రంగంలోని కోట్ల మంది కార్మికుల పొట్ట కొట్టేలా ఈ నిర్ణయం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
——-
రూ.1.62 లక్షలకు పసిడి..
బంగారంపై దిగుమతి సుంకాన్ని అమాంతం పెంచడంతో బుధవారం అమాంతం ధరలు పెరిగాయి. గుడ్ రిటర్న్స్ ప్రకారం.. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.8,020 పెరిగి రూ.1,62,150కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.7,350 ప్రియమై రూ.1,48,650గా పలికింది. కిలో వెండిపై రూ.20వేలు ఎగిసి రూ.3.10 లక్షలుగా నమోదయ్యింది. దీంతో 10 గ్రాముల వెండి ధర రూ.2900గా పలికింది.



