రూ.30 లక్షలకు ప్రశ్నాపత్రం కొనుగోలు! గురుగ్రామ్ వైద్యుడి నుంచి పొందిన రాజస్తాన్ సోదరులు
పరీక్షకు వారం ముందే ఈ వ్యవహారం
సికార్ కేంద్రంగా దేశవ్యాప్తంగా లీక్
దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
ఇప్పటికి ఐదుగురి అరెస్ట్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరమవుతోంది. రాజస్తాన్‌లోని జామ్‌వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు పరీక్షకు వారం ముందే హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అనంతరం ఆ ప్రశ్నాపత్రాన్ని వారు పలువురు అభ్యర్థులకు విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ప్రశ్నాపత్రాన్ని తన కుమారుడినకి అందించిన నిందితుడు
దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు సోదరుల్లో ఒకరు గురుగ్రామ్ వైద్యుడి నుంచి కొనుగోలు చేసిన ఆ ప్రశ్నాపత్రాన్ని నీట్‌కు సిద్ధమవుతున్న తమ కుమారుడికి అందించారు. ఆ తర్వాత వారు ఏప్రిల్ 29న సికార్‌లో పలువురికి విక్రయించినట్టు సమాచారం. దీంతో రాజస్తాన్‌లోని సికార్ ఈ ఏడాది పేపర్ లీక్ వ్యవహారానికి కేంద్రబిందువుగా మారింది. జామ్‌వా రామ్‌గఢ్ నుంచి ప్రశ్నాపత్రం ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్ మండావారియాకు చేరగా, ఆయన దానిని మరొకరికి విక్రయించాడు. కోచింగ్ సెంటర్ల పరిసరాల్లో కార్యకలాపాలు నిర్వహించే రాకేశ్.. ఆ పేపర్‌ను రూ.30 వేలకు కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న సికార్‌కు చెందిన ఓ విద్యార్థికి అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఓ హాస్టల్ ఓనర్‌కు చేరిన ప్రశ్నాపత్రం
అటు తర్వాత పరీక్షకు ఒక రోజు ముందు సదరు విద్యార్థి సికార్‌లో పీజీ హాస్టల్ నడుపుతున్న తన తండ్రికి వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రం పంపాడు. సికార్‌లోని ఒక స్నేహితుడి నుంచి తనకు ఈ ప్రశ్నాపత్రం అందిందనీ, హాస్టల్‌లో ఉన్న బాలికల (విద్యార్థినులు)కు దీనిని ఇవ్వాలని ఆ విద్యార్థి తన తండ్రికి చెప్పాడు. రేపు జరిగే పరీక్షలో ఇవే ప్రశ్నలు వస్తాయని కూడా చెప్పినట్టు దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ ప్రశ్నాపత్రం హాస్టల్‌లో ఉన్న పలువురికి చేరినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ కేసులో గురుగ్రామ్ డాక్టర్ కీలక పాత్రధారిగా ఉన్నాడు. ఈ ప్రశ్నాపత్రం మొదట మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి చైన్ నెట్‌వర్క్ ద్వారా గురుగ్రామ్ వైద్యుడి వద్దకు చేరిందని, అక్కడి నుంచి రాజస్తాన్ సోదరులు ఇద్దరు కొనుగోలు చేసి, ఇతరులకు విక్రయించినట్టు రాజస్తాన్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఓజీ) అనుమానిస్తోంది. అయితే గురుగ్రామ్‌లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డా.రాజేశ్ కతారియా మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై గురుగ్రామ్ వైద్యుడి గురించి తమను ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు సంస్థ కూడా సంప్రదించలేదని తెలిపారు.
ప్రశ్నాపత్రం లీకేజీపై నెలరోజుల ముందే సమాచారం
దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అరెస్టయిన సోదరులకు నెల రోజుల ముందే పేపర్ లీక్ అవుతుందని సమాచారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో దినేశ్‌కు ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నట్టు కూడా సమాచారం. వీరి కుటుంబానికి చెందిన నలుగురు విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించినట్టు కూడా దర్యాప్తు వర్గాలు చెప్తుండటం గమనార్హం.
సికార్‌లో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో ప్రశ్నాపత్రం షేరింగ్
ఇక ఈ ప్రశ్నాపత్రం లీకైన సికార్‌లో విద్యార్థులు, కోచింగ్ నిర్వాహకులు కలిసి వాట్సాప్, టెలిగ్రాaమ్ గ్రూపు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ప్రశ్నాపత్రాన్ని పంచుకున్నట్టు తెలుస్తోంది. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి హర్యానా, జామ్‌వా రామ్‌గఢ్ మార్గంగా సికార్‌కు చేరిన ప్రశ్నాపత్రం , ఆ తర్వాత అక్కడి నుంచి జమ్మూకాశ్మీర్, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్‌లకు వ్యాపించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
700 మందికి పంపిణీ చేసిన రాకేశ్ కుమార్
కాగా డెహ్రాడూన్‌లో అరెస్టయిన రాకేశ్ కుమార్ మండావారియా దాదాపు 700 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రాన్ని పంపిణీ చేసినట్టు సమాచారం. అనంతరం ఆ పీడీఎఫ్ విస్తతంగా చక్కర్లు కొట్టడంతో పాటు ప్రింటెడ్ కాపీల రూపంలో కూడా విక్రయించబడినట్టు సమాచారం. హర్యానాలో పేపర్ విక్రయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యశ్ యాదవ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో కూడా ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో నీట్ పరీక్ష లీక్ వ్యవహారంలో ఇప్పటికీ ఐదుగురు అరెస్టయ్యారు.ఈనెల 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం అనుమతితో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం రద్దు చేసిన విషయం విదితమే. అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశించడంతో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కొత్త పరీక్ష్ష తేదీలను 7 నుంచి 10 రోజుల్లో ప్రకటిస్తామని ఎన్‌టీఏ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం, నమ్మకద్రోహం, సాక్ష్యాల ధ్వంసం తదితర అభియోగాలతో కేసు నమోదు చేసింది. అలాగే అవినీతి నిరోధక చట్టం, పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ యాక్ట్-2024 కింద కూడా కేసులు నమోదు చేసింది.రాజస్తాన్ పోలీసుల ఎస్‌ఓజీ స్వాధీనం చేసుకున్న ”కెమిస్ట్రీ గెస్ పేపర్”లో ఉన్న 410 ప్రశ్నల్లో దాదాపు 120 ప్రశ్నలు అసలు పరీక్షలో వచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.



