– ముంబయిపై లక్నో విజయం
– లక్నో 214/6, ముంబయి 196/6
నామమాత్రపు మ్యాచ్‌లో నికోలస్ పూరన్ (75, 29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) అదరగొట్టాడు. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన నికోలస్ పూరన్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ స్కోరు అందించాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ (55) అర్థ సెంచరీతో రాణించాడు. ఛేదనలో ముంబయి ఇండియన్స్ చతికిల పడింది. ముంబయి ఇండియన్స్ పదో పరాజయంతో సీజన్‌ను ముగించగా.. ఏడో విజయంతో లక్నో నిష్క్రమించింది.
నవతెలంగాణ-ముంబయి
లక్నో సూపర్‌జెయింట్స్ ఊరట విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు లేకపోయినా సీజన్లో ఏడో విజయంతో నిష్క్రమించింది. 215 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్ చతికిల పడింది. రోహిత్ శర్మ (68, 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), నమన్ దిర్ (62 నాటౌట్, 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరిసినా ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులే చేసింది. 18 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. అంతకముందు, నికోలస్ పూరన్ (75, 29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (55, 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది.
పూరన్, రాహుల్ జోరు: సొంతమైదానం వాంఖడేలో నామమాత్రపు గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లక్నో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (0) డకౌట్‌తో సీజన్‌ను ముగించాడు. సీజన్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న పడిక్కల్ ఎదుర్కొన్న బంతికే వికెట్ కోల్పోయాడు. మార్కస్ స్టోయినిస్ (28, 22 బంతుల్లో 5 ఫోర్లు) తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ (55)తో కలిసి రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. ఐదు ఫోర్లతో మెరిసిన స్టోయినిస్ … పియూశ్ స్పిన్‌కు డగౌట్‌కు చేరాడు. పవర్‌ప్లేలో 49 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన లక్నో ఇన్నింగ్స్‌ను మందకోడిగా మొదలుపెట్టింది. దీపక్ హుడా (11) సైతం నిరాశపరిచాడు. రాహుల్ ఓ ఎండ్‌లో నిలబడినా ఆశించిన వేగంతో పరుగులు చేయలేదు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (75) ధనాధన్ దూకుడుతో రెచ్చిపోయాడు. వరుసగా బౌండరీలు బాదిన నికోలస్ పూరన్ 19 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. మరోవైపు రాహుల్ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 బంతుల్లో అర్థ సెంచరీ అందుకున్నాడు. ఫిఫ్టీ అనంతరం పూరన్ మరింత ప్రమాదకరంగా మారాడు. 8 సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు. రాహుల్, నికోలస్ పూరన్ నిష్క్రమణతో సూపర్‌జెయింట్స్ 200 పరుగుల లోపే పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ ఆయుశ్ బడోని (22 నాటౌట్, 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మంచి ముగింపు అందించాడు. కృనాల్ పాండ్య (12 నాటౌట్)తో కలిసి ఆఖర్లో దంచికొట్టాడు. లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది.