న‌త్తి‌ని అదిగ‌మించింది.. పాప్ సింగ‌ర్ అయ్యింది..

Got stuttering.. Became a pop singer..భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ కళాకారిణి రాధికా వెకారియా ముప్ఫై ఏండ్ల వయసులో ప్రపంచవ్యాప్తంగా సంచనం సృష్టిస్తోంది. ఒకప్పుడు సరిగ్గా మాట్లాడలేక ఇబ్బంది పడింది. తన పేరు పలకడానికి కూడా కష్టపడిన ఆమె ఇప్పుడు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. బాల్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అనేక అవమానాలు భరించింది. వేధింపులు, బెదిరింపులు సైతం ఎదుర్కొవల్సి వచ్చింది. ఆ అవమానాలు, వేధింపుల నుంచే తన విజయాన్ని వెదుక్కుంది. మౌనంగా ఉంటూనే ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగిన ఆమె స్ఫూర్తిదాయక పరిచయం నేటి మానవిలో…
మొదటి సారి గ్రీమీ అవార్డుకు నామినేట్‌ అయిన భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్‌ వాయిద్య కళాకారిణిగా రాధిక వెకారియా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిబ్రవరి 2న లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన గ్రామీ అవార్డ్స్‌ కార్యక్రమంలో టేలర్‌ స్విఫ్ట్‌, బిల్లీ ఎలిష్‌, సబ్రినా కార్పెంటర్‌ చాపెల్‌ రోన్‌ వంటి పాపులర్‌ దిగ్గజాలతో కలిసి నడిచింది.
ఆత్మవిశ్వాసంతో ముందగుడు
2013 నుండి అమెరికాలో నివసిస్తున్న రాధిక వెకారియా లండన్‌లో పుట్టింది. ఈమె తాతముత్తాతలు భారత సంతతికి చెందినవారు. బాల్యం నుంచి దీర్ఘకాలిక ప్రసంగలోపం(నత్తి)తో బాధపడేది. మాట్లాడడంలో ఇబ్బంది ఉన్నా తాను కచ్చితంగా పాడగలనని గ్రహించింది. ఆత్మవిశ్వాసంతో ముందగుడు వేసింది. అందుకే మాట్లాడటం నేర్చుకునే ముందు పాడటం నేర్చుకుంది. అమ్మమ్మ నుంచి స్ఫూర్తి పొందిన రాధిక చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి పెంచుకుంది. ఆర్టిస్ట్‌గా రాణించింది. వారియర్స్‌ ఆఫ్‌ లైట్‌ ఆల్బమ్‌ నామినేషన్‌కు ఎంపికైంది. ఈ ఆల్బమ్‌ను రాధిక సంస్కృతం, హిందీ, తమిళం, ఆంగ్లభాషల్లో పాడటం విశేషం. ఉత్తమ న్యూ ఏజ్‌, యాంబియంట్‌ లేదా చాంట్‌ ఆల్బమ్‌ విభాగంలో అనౌష్కా శంకర్‌, రికీ కేజ్‌ వంటి ప్రముఖ కళాకారులతో తలపడింది.
ఆమె ఏమంటుందంటే…
‘మాటల సమస్య ఉన్న చాలా మంది నిజానికి చాలా మంచి గాయకులు. దానికి శ్రావ్యత, కొంచెం స్వరం, కొంచెం సంగీత జ్ఞానం అలవడితే గాయకులుగా రాణిస్తారు. అంతేకాదు అది మనసుకు ప్రశాంతత నిస్తుంది. మెదడుకు మంచిది. నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. అందుకే నాకు పాడటం అలవాటైంది. అసలు నాకున్న సమస్యను అధిగమించగలనని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. నా పాట విని స్నేహితులు, కుటుంబ సభ్యులు ముగ్ధులయ్యారు. అసలు వేదికలపై మాట్లాడతానని, ఇప్పుడు చేస్తున్న పనులన్నీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను నేర్చుకున్న సంగీతమే నన్ను స్వేచ్ఛగా మాట్లాటగలిగేలా చేసింది. నా వయసు పెరుగుతున్న కొద్దీ నాలోని సమస్య నయం కావడం ప్రారంభమయింది. పెద్దయ్యాక పాడడానికి ధానం చేసేదాన్ని. అది చాలా ప్రభావాన్ని చూపించింది. నాలోని లోపాన్ని చూసి భయపడడం మానేసి, నాలో ఏదో శక్తి ఉందని, పాడగలని గుర్తించడమే నా జీవితంలో ఓ పెద్ద మలుపుకు కారణమయ్యింది’ అంటూ ఆమె ఎంతో సంతోషంగా పంచుకున్నారు.

Spread the love