మేలో పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు

– ఫిబ్రవరి 16 గ్రామీణ, పారిశ్రామిక బంద్‌కు మద్దతు
– పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పీఓడబ్ల్యూ రాష్ట్ర ఆరో మహాసభలు హైదరాబాద్‌లో మే నెలలో జరుగుతాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ ప్రకటించారు. ట్రేడ్‌యూనియన్లు, ఎస్‌కేఎం సంయుక్త పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ, పారిశ్రామిక బంద్‌కు మద్దతిస్తున్నామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మార్క్స్‌ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడాన్ని స్వాగతించారు. మహిళా కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్‌లను వెనక్కి తీసుకోవాలనీ, రైతులకు ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ మాట్లాడుతూ..మార్చి, ఏప్రిల్‌ నెలల్లో గ్రామ, మండల, జిల్లా మహాసభలను పూర్తిచేస్తామన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. ఆ సంఘం కోశాధికారి గీత మాట్లాడు తూ..వికారాబాద్‌లో దేవాలయం ముందు భిక్షాటన చేసే కుటుంబానికి చెందిన ఆరేండ్ల బాలికపై దేవాలయంలో ఉండే కుటుంబానికి చెందిన వ్యక్తి లైంగిక దాడి చేశాడనీ, దీన్ని పోలీసులు కప్పిపుచ్చేందుకు యత్నించారని విమర్శించారు. కార్యదర్శి సీత మాట్లాడుతూ..రాష్ట్రంలోని బెల్టుషాపులు కుటుంబాలను ఆగం చేస్తున్నాయనీ, వాటిని ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు జానకి, కావేరి, ఉపేంద్ర పాల్గొన్నారు.

Spread the love