Wednesday, July 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంథ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్ప‌త్తిని పెంచాలి

థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్ప‌త్తిని పెంచాలి

- Advertisement -

థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్ప‌త్తిని పెంచాలి
ఆధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
గత సర్కార్‌ ‌యాదాద్రి ధర్మల్‌ ‌ప్లాంట్‌‌ను నిర్లక్ష్యం చేసిందని విమర్శ
త్వరలో సింగరేణి గనుల్లో పర్యటిస్తానని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎల్‌‌నినో నేపథ్యంలో విద్యుత్‌ ‌సంక్షోభాన్ని తట్టుకునేందుకు వీలుగా జెన్‌‌కో థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో గ‌రిష్ట స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్‌‌లోని ప్ర‌జాభ‌వ‌న్ లో ఇంధ‌న‌శాఖపై ఆయన సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. జెన్‌‌కోలో పెరిగిన స్థాపిత విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం, దీర్ఘ‌కాలిక స‌మ‌యంలో బొగ్గు స‌ర‌ఫ‌రాలో ఏర్ప‌డే స‌వాళ్లు, భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక తదితరాంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రానికి సింగ‌రేణి నుంచి ఏటా 14 వేల ట‌న్నుల జీ9 గ్రేడ్ ర‌కం బొగ్గును స‌ర‌ఫ‌రా చేసేందుకు అన్ని ర‌కాల అనుమ‌తులు ఉన్నా, గ‌త ప్ర‌భుత్వం నిర్మాణ ప‌నుల్లో జాప్యం చేసిందని విమర్శించారు.
ప్రాజెక్టు నిర్మాణంలో ప్రణాళికా బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డంతో నేడు అనేక స‌మ‌స్య‌లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ రెండేండ్లలోనే 800 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తిని సాధించిన‌ట్టు చెప్పారు. తమ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లతో జెన్‌‌కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,180 మెగావాట్లకు చేరిందన్నారు. బొగ్గు సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 2025-26లో 27,908 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయన్నారు. రాష్ట్ర‌ మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 31 శాతం అవసరాలను ఆ సంస్థే స‌మ‌ర్థ‌వంతంగా తీర్చిందని వివరించారు.
బొగ్గు స‌రఫ‌రాలో ఇబ్బందులు ఉన్నా విద్యుత్ ఉత్పాద‌న‌లో జెన్ కో అత్యంత క్రియాశీల‌కంగా వ్యవహరిస్తోందని చెప్ప‌డానికి ఈ గ‌ణాంకాలే నిద‌ర్శ‌మ‌ని చెప్పారు. బొగ్గు స‌ర‌ఫ‌రాను మెరుగుప‌ర్చి, విద్యుత్ అవ‌స‌రాల్లో 40 శాతం మేర తీర్చ‌గ‌లిగే స్థాయికి ఆ సంస్థను తీర్చిదిద్దుతామనే ఆశాభావాన్ని ఆయన వ్య‌క్తం చేశారు. సెప్టెంబర్ 2026లో వైటీపీఎస్ 5వ యూనిట్ ను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి, ధర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్లకు సరఫరా తదితర అంశాలను పరిశీలించేందుకు తాను క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌కు వెళతానని భట్టి ఈ సందర్భంగా ప్ర‌క‌టించారు. సమీక్షలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జెన్ కో సీఎండీ ఎస్. హరీష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -