మరికొన్నింటికి గాయాలు
రూ.5 లక్షల నష్టం జరిగినట్టు అంచనా
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో ఘటన
నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో గొర్రెల, మేకల కొట్టంలోకి వీధికుక్కలు చేరి బీభత్సం సృష్టించడంతో 44 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాంతీ శ్రీనివాస్ రోజువారి లాగానే సోమవారం సాయంత్రం గ్రామంలోని షెడ్డులో తన మేకలు, గొర్రెలను తోలాడు. తిరిగి మంగళవారం ఉదయం వచ్చి చూడగా మందలో 44 గొర్రెలు, మేకలు మృత్యువాత పడగా.. మరికొన్ని జీవాలు గాయపడ్డాయి. వెంటనే అతను సర్పంచ్, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు అధికారులకు సమాచారమివ్వగా, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గోపాల కృష్ణమూర్తి, మండల అధికారి చతుర్వేది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకే మందకు చెందిన 44 గొర్రెలు మృత్యువాత పడటం విషాదకరమని, ఈ విషయాన్ని కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి బాధితునికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అయితే మృత్యువాత పడిన గొర్రెల విలువ సుమారు రూ.5 నుంచి 6 లక్షల వరకు ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
వీధి కుక్కలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి : సర్పంచ్
గ్రామంలో వీధికుక్కల హల్‌చల్ ఎక్కువ అయిపోయిందని, వాటిని నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సర్పంచ్ చింతల శ్రీనివాస్ యాదవ్ కోరారు. గ్రామంలో వీధి కుక్కలు అనేకసార్లు జంతువులపై, కోళ్లపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. గల్లీల వెంట నడవాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి కూత వేటు దూరంలోనే వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో చిన్నారులు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి వీధి కుక్కలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని కోరారు.
వీధి కుక్కల దాడిలో44 మూగ జీవాలు మృత్యువాత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



