– చెపాక్‌లో భారత క్రికెటర్ల ప్రాక్టీస్
– తొలి టెస్టు ముంగిట శిక్షణ శిబిరం
నవతెలంగాణ-చెన్నై
భారత క్రికెటర్లు మరో సవాల్‌కు సిద్ధమవుతున్నారు. ముచ్చటగా మూడోసారి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో పోటీపడేందుకు తహతహ లాడుతున్న టీమ్ ఇండియా స్వదేశంలో మరో టెస్టు సిరీస్ విజయంపై కన్నేసింది. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి చెన్నై చెపాక్‌లో భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు ఆరంభం కానుంది. 27 నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు జరుగనుంది. టెస్టుల్లో విజయశాతం 60కి పైగా కొనసాగించటంపై దృష్టి సారిం చిన రోహిత్‌సేన.. నాణ్యమైన బంగ్లాదేశ్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవు తోంది. బంగ్లాదేశ్ క్రికెటర్లు నేడు చెన్నైకి చేరుకోనుండగా.. భారత క్రికెటర్లు ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టారు. చెపాక్ స్టేడియంలో సాధన షురూ చేశారు.
స్పిన్ పిచ్‌లపై ప్రాక్టీస్
ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత క్రికెటర్లకు ఊహించని ఝలక్ తగిలింది. శ్రీలంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను వన్డే సిరీస్‌లో సమర్థవంతంగా కట్టడి చేశారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో కూడిన జట్టుపై వన్డే సిరీస్ విజయం సాధించారు. స్పిన్‌ను మెరుగ్గా ఆడలేకపోవటమే సిరీస్ ఓటమికి ప్రధాన కారణం. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఆ పొరపాటు పునరావృతం కాకూడదని జట్టు మేనేజ్‌మెంట్ ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇటీవల పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంలో ఉన్న బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక బద్దంగా సిద్ధం అవుతుంది. చెపాక్ పిచ్ స్పిన్‌కు స్వర్గధామం. బంగ్లాదేశ్‌లో నాణ్యమైన స్పిన్నర్లకు కొదవ లేదు. దీంతో ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మలు స్పిన్ పిచ్‌లుపై సాధన చేస్తున్నారు.
గంభీర్‌కు సవాల్
చీఫ్ కోచ్ గౌతం గంభీర్‌కు సైతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సవాల్ విసరనుంది. చీఫ్ కోచ్‌గా తొలి పర్యటనలోనే పరాజయం చవిచూసిన గంభీర్ ఇప్పుడు స్వదేశంలో కఠిన పరీక్ష ఎదుర్కొనున్నాడు. గతంలో భారత జట్టు స్వదేశీ పిచ్‌లను పేసర్లకు అనుకూలంగా తయారు చేశారు. కానీ ఇప్పుడు గౌతం గంభీర్ చెపాక్‌లో ఎర్ర మట్టితో చేసిన స్పిన్ పిచ్‌ను కోరినట్టు తెలుస్తోంది. సెంటర్ పిచ్‌పై పచ్చిక కనిపిస్తున్నా.. క్యూరేటర్ పిచ్‌పై ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే నీళ్లు పడుతున్నట్టు తెలుస్తోంది. యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సైతం స్పిన్ పిచ్‌లపై సాధన చేశారు.