Monday, April 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి

రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి

- Advertisement -

రెండో దశలో మండలాలకు విస్తరించండి
సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు పూర్తి అధికారాలు
ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్‌, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌
అన్ని స్థాయిల్లో నిత్యం పర్యవేక్షించాలి : ‘సీఎం ప్రజావాణి’ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు (08.12.2023) మహాత్మ జ్యోతిభాఫూలే ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ప్రతి మంగళవారం ‘సీఎం ప్రజావాణి’ కార్యక్రమం అద్బుతంగా కొనసాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలను, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నారని అన్నారు. ప్రస్తుతం కలెక్టర్ల అధ్వర్యంలో జిల్లాలో ప్రతివారం ప్రజావాణి నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్ధం ప్రజావాణి కార్యక్రమాన్ని వెంటనే రెవెన్యూ డివిజన్‌స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వాత మండల స్థాయిలో నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలన్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలను ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని సూచించారు. సంబంధిత విభాగాలకు పంపించి, వాటి పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు
ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలన్నారు. ఆలస్యం జరగకూడదని సూచించారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్‌, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ ఉండాలని ఆయన సూచించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సీఎం అన్నారు. ప్రతి స్థాయిలో ప్రజావాణి కోసం ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

అవసరమైతే అప్పీల్‌ వ్యవస్థ
ఒకస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే, పై స్థాయి అధికారికి అర్జీ అందేలా, ఆటో ఎస్కలేషన్‌ వ్యవస్థను అమలు చేయాలని సీఎం సూచించారు. అవసరమైతే అప్పీల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పెండింగ్‌ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్యాష్‌బోర్డ్‌ ద్వారా పరిష్కార పురోగతిని తెలుసుకునేలా వీలుండాలన్నారు. ఎక్కడైనా ఆలస్యం జరిగితే, సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌ అర్జీల సంఖ్య తగ్గుతోందన్నారు. కింది స్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -