న్యూఢిల్లీ : ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్ రాణిస్తున్నాడు. ఇటీవల వైఫల్యాల నుంచి కోలుకున్న హెచ్.ఎస్ ప్రణయ్ శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో మూడు గేముల పోరులో విజయం సాధించాడు. చైనీస్ తైపీ షట్లర్ వాంగ్ జువీపై 21-11, 17-21, 21-18తో ప్రణయ్ గెలుపొందాడు. 77 నిమిషాల పాటు సాగిన క్వార్టర్‌ఫైనల్ సమరంలో ప్రణయ్ చెలరేగాడు. తొలి గేమ్‌ను ఏకపక్షంగా గెల్చుకున్నాడు. రెండో గేమ్‌లో చైనీస్ తైపీ షట్లర్ పుంజుకుని లెక్క సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ చెలరేగాడు. ఆరంభంలో వెనుకంజ వేసినా.. కీలక సమయంలో ఊపందుకున్నాడు. 16-16 వద్ద స్కోరు సమం చేసి.. వరుస పాయింట్లు సాధించాడు. 21-18తో మూడో గేమ్‌ను, సెమీఫైనల్స్ బెర్త్‌ను కైవసం చేసుకున్నాడు. 8వ సీడ్ హెచ్.ఎస్ ప్రణరు నేడు సెమీఫైనల్లో ఆరో సీడ్ చైనా షట్లర్ షి యుకితో పోటీపడనున్నాడు.