– 600లో 574 మార్కులు సాధించిన పేద విద్యార్థి ప్రతిభకు ప్రశంసలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
లక్ష్యంతో చదివితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులూ అద్భుత ఫలితాలు సాధించగలరని అశ్వారావుపేట మండలం మామిళ్ళవారిగూడెం విద్యార్థి మద్దాల ప్రవీణ్ కుమార్ నిరూపించాడు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి ప్రభుత్వ రంగ పాఠశాలల విభాగంలో జిల్లా టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటాడు. అశ్వారావుపేట మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి 236 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, వారిలో 233 మంది ఉత్తీర్ణులై మంచి ఫలితాలు సాధించారు. ఈ ఫలితాల్లో మామిళ్ళవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మద్దాల ప్రవీణ్ కుమార్ అత్యధికంగా 574 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు.
పేద కుటుంబానికి చెందిన ప్రవీణ్ కుమార్ తన కృషి, పట్టుదలతో ఈ ఘనత సాధించడం విశేషం.ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతోందని ఆయన ఫలితం మరోసారి రుజువు చేసింది.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల టాపర్లు
పదో తరగతి పరీక్షల్లో 550కి పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతుల జాబితా ఇలా ఉంది:
మద్దాల ప్రవీణ్ కుమార్ – 574 మార్కులు (మామిళ్ళవారిగూడెం)
ఎం. కీర్తి – 561 మార్కులు (నారాయణపురం)
డి. సహస్ర – 556 మార్కులు (అశ్వారావుపేట బి)
వి. బిందు – 552 మార్కులు (గుమ్మడివల్లి)
డి. లాస్య – 551 మార్కులు (గుమ్మడివల్లి)
మృదుల – 550 మార్కులు (మామిళ్ళవారిగూడెం)
అదేవిధంగా..
బి. వరుణ్ – 540 మార్కులు (అచ్యుతాపురం)
ఎం.ఎన్.వి. దుర్గ – 538 మార్కులు (అశ్వారావుపేట జి) మంచి ఫలితాలతో ప్రతిభ కనబరిచారు.
విద్యార్థుల ఈ విజయంపై మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ప్రసాదరావుతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. హరిత, ఎన్. కొండలరావు, షహీనా బేగం, తాళ్ళపాటి వీరేశ్వరరావు, సింగపోగు వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని, వచ్చే విద్యాసంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.



