ములుగు జిల్లా అధ్యక్ష పదవి ఉద్యమకారులకే ఇవ్వాలి..

నవతెలంగాణ -తాడ్వాయి 
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కీర్తిశేషులు కుసుమ జగదీశ్ గారి అకాల మరణంతో ఖాళీ అయిన జిల్లా అధ్యక్ష పదవిని, మళ్ళీ ఉద్యమకారులకే ఇవ్వాలని ఆ సంఘం జిల్లా కన్వినర్ పత్తి గోపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సారి ములుగు నియోజకవర్గంలో గులాబీ జండా ఎగరాలంటే నిరంతరం, ఎల్లప్పుడు ప్రజల్లో ఉండి, కష్టపడేతత్వం ఉండే నాయకునికి ఇవ్వాలన్నారు. ఇది ఉద్యమకారులకు అయితే సాధ్యమని అభివర్ణించారు. ఉద్యమకారులు తెలంగాణ రాక ముందు నుండి ప్రజల్లో ఉండి కొట్లాడారు కనుక ప్రజలలో ఉండే నాయకుడు ఉద్యమకారులు కాబట్టి జిల్లా అధ్యక్ష పదవిని కూడా ఈసారి ఉద్యమకారునికి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ మధ్య పార్టీలో కొంత అసంతృప్తి, కార్యకర్తలలో అసహనం పెరిగిందని అందర్నీ కలుపుకుపోయే నాయకత్వం అవసరమని, కార్యకర్తలను అక్కున చేర్చుకొని వారిని ఎల్లవేళలా కాపాడుకునే పద్ధతిలో ఉండే నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానంను కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి వారధిలా ప్రజల బాగోగులు పట్టించుకునే వారికే పదవి ఇస్తే పార్టీ అభివృద్ధి పథం లో వెళ్తుందని తెలిపారు.
Spread the love