Wednesday, July 15, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్చర్మవ్యాధులు రాకుండా

చర్మవ్యాధులు రాకుండా

- Advertisement -

వర్షాకాలంలో సరిగా ఆరని బట్టలు ధరించడం వల్లగానీ, పాదాలు ఎక్కువసేపు నీటిలో నానడం వల్లగానీ చర్మవ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వర్షాలు నిరంతరంగా కురవకపోవడంతో ఎండాకాలంలో మాదిరిగానే విపరీతంగా చెమట పడుతోంది. ఒకవైపు అప్పుడప్పుడు కురిసే వర్షాల వల్ల ఏర్పడే తేమ, మరోవైపు వేడి కారణంగా పట్టే చెమట… ఈ రెండింటి ప్రభావంతో చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ కాలంలో ఫంగస్‌, బ్యాక్టీరియా వల్ల వచ్చే కొన్ని చర్మవ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరి వాటి లక్షణాలేమిటి? వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

తామర (రింగ్‌వర్మ్ / టినియా) : ఇది ఫంగస్‌ వల్ల వచ్చే అంటువ్యాధి. గుండ్రంగా, ఎర్రటి అంచులతో కూడిన దురదపెట్టే మచ్చల రూపంలో కనిపిస్తుంది. తల, శరీరం, గజ్జలు, పాదాలు తదితర భాగాలకు సోకుతుంది. వ్యాధి సోకిన వ్యక్తిని తాకడం లేదా వారు ఉపయోగించిన తువ్వాళ్లు, దుస్తులు వంటివి ఉపయోగించడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. అందువల్ల చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు.

పాద తామర (అథ్లెట్స్‌ ఫుట్ / టినియా పెడిస్‌) : ఎక్కువసేపు షూస్‌, సాక్సులు ధరించడం వల్ల పాదాల వేళ్ల మధ్య తేమ పేరుకుని ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వస్తుంది. చర్మం ఎర్రబడటం, తెల్లటి పొరలు ఏర్పడటం, తీవ్రమైన దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని నివారించాలంటే ప్రతిరోజూ పాదాలను శుభ్రంగా కడిగి, తువ్వాలుతో పూర్తిగా తుడిచి ఆరబెట్టాలి. తడి సాక్సులు ధరించకూడదు.

చర్మ మడతల దద్దుర్లు (ఇంటర్‌ట్రైగో) : రొమ్ముల కింద, చంకల్లో, తొడల మడతల్లో తేమ ఎక్కువసేపు ఉండడం వల్ల ఈ ఇన్ఫెక్షన్‌ వస్తుంది. మొదట చర్మం ఎర్రబడుతుంది. తర్వాత పుండ్లు, మంట, దురద ఏర్పడతాయి. చికిత్స ఆలస్యమైతే మచ్చలు మిగిలే అవకాశం ఉంటుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలంలో ప్రతిరోజూ స్నానం చేసి శరీరాన్ని పూర్తిగా తుడిచి పొడిగా ఉంచుకోవాలి. చెమట పట్టిన వెంటనే తడి దుస్తులు మార్చుకోవాలి. సరిగా ఆరని బట్టలు, తడి చెప్పులు, సాక్సులు ధరించకూడదు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. తువ్వాళ్లు, దుస్తులు, రేజర్లు వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. చర్మంపై దురద, దద్దుర్లు, మచ్చలు, పుండ్లు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే స్వయంగా మందులు వాడకుండా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -