తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక్క నినాదంలో చెప్పాలంటే అది ‘‘నీళ్లు, నిధులు,నియామకాలు’’. నీటి కోసం రైతు పోరాడాడు. నిధుల కోసం ప్రాంతం ఉద్యమించింది. కానీ, అత్యంత ఉద్వేగంతో వీధుల్లోకి వచ్చింది మాత్రం నిరుద్యోగ యువత. లక్షలాది మంది విద్యార్థులు చదువులను పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎందుకంటే, ప్రత్యేక రాష్ట్రమొస్తే ఉద్యోగాలు వెల్లువలా వస్తాయని, ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన ఖాళీలు భర్తీ అవుతాయని, నిరుద్యోగం కాలగర్భంలో కలిసి పోతుందని కలలు కన్నారు. కానీ, రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటింది. ప్రభుత్వమూ మారింది. ఉద్యోగాల కోసం యువత రోడ్డెక్కాల్సిన దుస్థితి మాత్రం మారలేదు. రాష్ట్ర రాజధానిలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద జరిగిన ‘‘నిరుద్యోగుల ధర్నా’’ అందుకు ప్రత్యక్ష నిదర్శనం. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు ‘‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’’ పేరుతో ఇచ్చిన హామీలు యువతలో భారీ ఆశలు రేకెత్తించాయి. ‘‘యేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’ అని చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప, ఆచరణకు నోచుకోలేదు. పైగా ‘‘నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం, ఖాళీలన్నింటినీ పారదర్శకంగా భర్తీ చేస్తాం, ప్రతి జిల్లాలో ఉద్యోగ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం’’ ఈ వాగ్దానాలన్నీ బుట్టదాఖల య్యాయి. రాష్ట్రంలో అసలు ఎంతమంది నిరుద్యోగులున్నారు? ఖాళీలెన్నీ? భర్తీ చేసినవెన్నీ? ఇలాంటి అంశాలపై ఇంతవరకు ఓ నిర్ధారణ లేదంటే అతిశయోక్తి కాదేమో! రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అరవై ఏడు వేల పైచిలుకు నియామకాలు పూర్తయ్యాయని చెబుతోంది.
అయితే అందులో పదహారు వేలకు పైగా పోస్టులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన నియామకాలుగా తెలుస్తోంది. అందులో పోలీస్ కానిస్టేబుళ్లకు సంబంధించినవే ఎక్కువ. మిగిలిన పోస్టులు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తవడంతో జరిగిన నియామకాలే. మరోవైపు రాష్ట్రంలో ఇంకా ఎనభై ఏడు వేలకుపైగా ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని నిరుద్యోగ సంఘా ల వాదన. ముఖ్యం గా టీచర్ పోస్టుల్లో నలభై ఆరు వేలు ఖాళీగా ఉండటం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు, లక్షలాది నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసినట్టే! జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తానన్న ఖాళీలను పట్టించుకోక పోవడం నిరుద్యోగుల ఆగ్రహానికి ప్రధాన కారణం.పైగా నోటిఫికేషన్ కోసం ఏండ్ల తరబడి ఎదురు చూడడం, పరీక్షలు రాయడం, ఫలితాల కోసం మరో ఏడాది వేచి ఉండడం, కోర్టు కేసులతో నియామకాలు నిలిచిపోవడం వారి జీవితంలో భాగమైపో యింది. ఒక ఉద్యోగం కోసం ఐదేళ్లు, ఆరేళ్లు సిద్ధమవుతున్న యువతకు వయోపరిమితి దాటిపోతున్నది. వారి జీవితంలోని బంగారు కాలం పరీక్ష గదుల్లోనే ముగిసిపోతోంది. దీనికి బాధ్యతెవరిది? ఇకపోతే ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న యువతను మరోవైపు కోచింగ్ సెంటర్ల వ్యాపారం నిలువునా దోచుకుంటోంది.
లక్షల రూపాయల ఫీజులు, హాస్టల్ ఖర్చులు, పుస్తకాలు, పరీక్ష ఫీజులు… ఇవన్నీ భరించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, బంగారం తాకట్టు పెడుతున్నారు. కానీ, ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు.ఇప్పుడదే వారిని తీవ్రంగా వేధిస్తోంది. అందుకే ‘కొలువులకై కొట్లాడుదాం’ అంటూ యువత రోడ్డుపైకి వస్తోంది. ఇదిలా ఉంటే, మరోవైపు వేలాది మంది నిరుద్యోగులు బతుకుదెరువు కోసం జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్‌గా, క్యాబ్ డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా పనిచేస్తూ మిగిలిన సమయంలో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పగలు శ్రమ, రాత్రి చదువు, ఇదే వారి దినచర్య. ఉద్యోగం కోసం పోరాటం చేస్తున్న యువతను ఈ స్థితికి నెట్టిన ప్రభుత్వాలు వారి బాధకు సమాధానం చెప్పాలి. ఈ సంక్షోభంలో కేంద్రానిదే ప్రధాన బాధ్యత. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి నోచుకోవడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తూ, ప్రయివేటీకరణను వేగవంతం చేస్తూ స్థిరమైన ఉద్యోగాలను తగ్గించింది.
ఆ స్థానంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ను ప్రవేశపెట్టింది. పైగా ‘పకోడీలు అమ్మడం, బజ్జీలు వేయడం’ కూడా ఉద్యోగాలేనని చెపుతూ యువతను హేళన చేస్తోంది. రాష్ట్రం విషయానికొస్తే ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన త్యాగాలను ఈ సందర్భంలో మరచి పోవడం చరిత్రను అవమానించినట్టే. ‘‘నియామకాలు’’ అనే పదం ఉద్యమ నినాదంలో ఉండి, పాలనలో కనిపించకపోతే తెలంగాణ ఆత్మనే ప్రశ్నించినట్లవుతుంది. సర్కారు బాధ్యత- ఉద్యోగం కోసం పోరాడుతున్న యువతను చట్టాలు, కేసులు, లాఠీలతో అణచి వేయడం కాదు, ఇచ్చిన హామీలను నెరవేర్చడం. అదే నేటి యువత వీధుల్లో నిలబడి అడుగుతోంది. ఈ ప్రశ్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిందే.



