– ఏప్రిల్‌లో గెలల ధర రూ.23,501
– పామాయిల్ రైతుల్లో పెరిగిన ఆశలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏప్రిల్ నెలలో సేకరించిన పామాయిల్ గెలల ధరను టన్నుకు రూ.23,501గా ఆయిల్ ఫెడ్ పాలక మండలి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. మార్చి నెలలో టన్ను గెలల ధర రూ.23,005గా ఉండగా, ఏప్రిల్ నెలకు రూ.23,501గా నిర్ణయించడంతో టన్నుకు రూ.496 పెరుగుదల నమోదైంది. గత నాలుగు నెలలుగా గెలల ధరలు నెలనెలా పెరుగుతూ రావడం పామాయిల్ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గెలల దిగుబడులు పెరగడం, ధరలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఏడాది పామాయిల్ సాగు రైతులకు ఆశాజనకంగా మారింది. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులతో పాటు కొత్తగా పామాయిల్ సాగు వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
దీనికి అనుగుణంగా రానున్న వ్యవసాయ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మరో 40 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరించాలని ఆయిల్ ఫెడ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గెలల దిగుబడి, ధరలు ఇదే విధంగా కొనసాగితే పామాయిల్ రైతులు ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఉందని రైతు వర్గాలు భావిస్తున్నాయి. కొత్త రైతులు కూడా పామాయిల్ సాగుపై ఆసక్తి చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు గెలల దిగుబడి, ధరలలో స్పష్టమైన పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో గెలల సేకరణ 29,076.060 టన్నులకు చేరడం, ధర టన్నుకు రూ.23,501కు పెరగడం రైతుల్లో మరింత జోష్ నింపింది.
నెలవారీ గెలల దిగుబడి - ధరలు
నెల గెలలు (టన్నులు) ధర (రూ./టన్ను)
జనవరి 9344.220 20456
ఫిబ్రవరి 8316.847 21546
మార్చి 14824.990 23005
ఏప్రిల్ 29076.060 23501



