నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

నవతెలంగాణ – ఢిల్లీ
అధునాత వసతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. స్పీకర్‌ పోడియం వద్ద సెంగోల్‌ను ప్రతిష్టించారు. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీకి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. అక్కడే జరిగిన యాగంలో పాల్గొన్నారు. స్పీకర్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పూజ అనంతరం సెంగోల్‌ను ప్రధానికి పూజారులు అందించారు. దానిని లోక్‌సభ స్పీకర్‌ కుర్చీ వద్ద ప్రతిష్ఠించి జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత నూతన పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులను ప్రధాని సన్మానించారు. శాలువాలతో సత్కరించి వారికి జ్ఞాపికను అందజేశారు. ప్రస్తుతం పార్లమెంటు భవన ప్రాంగణంలో సర్వతమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. కాగా, భారత ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు ముఖ్య కేంద్రంగా నిలిచే పార్లమెంట్‌ నూతన భవనం విషయంలో మోదీ సర్కార్‌ వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణి వివాదాస్పదమైంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేకుండా చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించటంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌, డీఎంకే, ఉద్ధవ్‌వర్గం శివసేన, ఆప్‌, ఎస్పీ, సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్‌-మణి, విధుత్‌లాయి కచ్చి, ఆర్డీఎల్‌, టీఎంసీ, జనతాదళ్‌ (యు), ఎన్సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, ఎన్‌సీ, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే, ఏఐఎంఐఎం పార్టీలు బహిష్కరించాయి.

Spread the love