నవతెలంగాణ హైదరాబాద్:‘పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఈ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుంది. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోడీకి కొత్తేం కాదు. పార్లమెంట్‌లో విపక్ష నేతలు భారత ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్ చేశారు. వారి మాటలను మ్యూట్ చేశారు. పార్లమెంట్ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టినప్పుడు.. ఇక కొత్త భవనంలో మాకు ఏ విలువా కనిపించడం లేదు’ అని విపక్ష పార్టీలు తమ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మా నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తాం: బీఆర్‌ఎస్
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనాలా..? లేక ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాలా..? అనే దానిపై తాము రేపు నిర్ణయించుకుంటామని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు మీడియాకు తెలిపారు.
ఇదిలా ఉంటే.. తన చర్యను కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. జాతీయ స్ఫూర్తి, దేశ పురోగతిపై గర్వించడమనేది కాంగ్రెస్‌కు కొరవడిందని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి విమర్శించారు. పార్లమెంటు అనుబంధ భవనాన్ని 1975 అక్టోబరు 24న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారనీ, ఆమె తనయుడు రాజీవ్‌గాంధీ కూడా ప్రధానిగా 1987 ఆగస్టు 15న పార్లమెంటు గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. అప్పట్లో ప్రభుత్వాధినేతలు చేయగా లేనిది ఇప్పుడు చేస్తే తప్పేమిటని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు.
19 పార్టీలు
కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన(యూబీటీ), ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ(ఎం), సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్(మణి), వీసీకే, ఆర్‌ఎల్‌డీ, టీఎంసీ, జేడీ(యూ), ఎన్‌సీపీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే తదితర పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి.