అయోధ్యపై స్మారక స్టాంపులు విడుదల చేసిన ప్రధాని

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయంపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం స్మారక స్టాంపులు విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు జారీ చేసిన స్టాంపుల పుస్తకాన్ని రాముడికి అంకితం చేశారు. స్టాంపుల డిజైన్లలో రామాలయం, ‘మంగళ్‌ భవన్‌ అమంగళ్‌ హరి’ అని రాసిన వాక్యాలు, సూర్యుడు, సరయూ నది, ఆలయంలో, చుట్టుపక్కల గల శిల్పాలు వున్నాయి. గురువారం విడుదల చేసిన ఆరు స్టాంపుల్లో అయోధ్యలోని రామాలయం, వినాయకుడు, హనుమంతుడు, జటాయువు, కేవట్‌రాజ్‌, మా శబరిలు వున్నాయి. ఇవన్నీ రాముడితో ముడిపడినవే. వీటిల్లోని ఐదు భౌతికాంశాలు పంచభూతాలైన ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమిలకు ప్రతీకగా వున్నాయి. వివిధ సమాజాల్లో శ్రీరాముడి పట్ల ఆకర్షణను ప్రదర్శించే ప్రయత్నంగా ఈ స్టాంపులపై పుస్తకాన్ని తీసుకువచ్చారు. 48పేజీల ఈ పుస్తకంలో అమెరికా, న్యూజీలాండ్‌, సింగపూర్‌, కెనడా, కంబోడియా, నేపాల్‌, శ్రీలంక, థాయిలాండ్‌లతో సహా 20 దేశాలు, కొన్ని ఐక్యరాజ్య సమితి సంస్థలు జారీ చేసిన స్టాంపులు వున్నాయి.
కేంద్ర కార్యాలయాలకు 22న ఒక పూట సెలవు
న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఈ నెల 22న ఒక పూట సెలవు ప్రకటించినట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యలో జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థల కార్యాలయాలన్నీ మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూతపడి వుంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాలు పేర్కొన్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సహా 7వేల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వివిధ దేశాల నుంచి వందమందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.
లౌకిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయంటూ సీపీఐ(ఎం) విమర్శ
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట శలవు ప్రకటించడం, అలాగే ఈ కార్యక్రమానికి మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం చూస్తుంటే మతపరమైన అంశాన్ని ప్రభుత్వం రాజకీయం చేయడం ఎక్కువైందని స్పష్టమవుతోందని సీపీఐ(ఎం) విమర్శించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో లౌకిక సూత్రాలకు, విలువలకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని పేర్కొంది. వీటిని తక్షణమే రద్దు చేయడం అత్యవసరమని సీపీఐ(ఎం) ఒక ప్రకటనలో పేర్కొంది.

Spread the love