ఐదు డిమాండ్లను వినిపించిన ప్రియాంక గాంధీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ :  ఇండియా ఫోరం ప్రధానంగా ఐదు డిమాండ్లను లేవనెత్తుతోందని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ఇడి, సిబిఐ, ఐటి అధికారులు ప్రతిపక్ష నేతలపై బలవంతంగా చేపట్టిన చర్యలను ఇసి నిలువరించాలని డిమాండ్‌ చేశారు. హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ను తక్షణమే విడుదల చేయాలని, ప్రతిపక్షాలను ఆర్ధికంగా నిర్వీర్యం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బీజీపీ సేకరించిన నిధులపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు.
మ్యాచ్ ఫిక్సింగ్‌కు యత్నిస్తున్న ప్రధాని మోడీ :  రాహుల్ గాంధీ
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి యత్నిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌ ఇడి అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా ఫోరం లోక్‌తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) పేరుతో ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో ఎన్నికలను క్రికెట్‌ మ్యాచ్‌తో పోలుస్తూ రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఐపీల్‌ మ్యాచ్‌ల్లో అంపైర్లపై ఒత్తిడి పెంచి, ప్లేయర్లను కొనుగోలు చేసి.. కెప్టెన్లు మ్యాచ్‌ గెలుస్తారు. దీన్ని క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటారు. రాజకీయాల్లోకూడా అలాగే.. లోక్‌ సభ ఎన్నికల్లో ముందు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతుంది. అంపైర్లు ప్రధాని మోడీని ఎంచుకుంటారు’ అని ఎద్దేవా చేశారు. తమ టీం నుండి ఇద్దరు ప్లేయర్లను అరెస్ట్‌ చేస్తారని, కొంతమంది ధనవంతుల కుట్రతో పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కోవడానికి ప్రధాని మోడీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేస్తున్నారని అన్నారు. ఇవిఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా, మీడియాపై ఒత్తిడి పెంచడం వంటివి చేయకుండా బిజెపి కనీసం 180 సీట్లు కూడా గెలవలేదని అన్నారు.  భారీ మద్దతుతో ఓట్లు వేయకపోతే ఓట్లు వేయకపోతే.. బీజీపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసి గెలుస్తుందని మండిపడ్డారు. వారు విజయం సాధిస్తే.. రాజ్యాంగాన్ని కూడా నాశనం చేస్తారని రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.
నియంతృత్వం నుండి విముక్తి కోసం ఇండియా ఫోరం కి మద్దతు  ఇవ్వండి : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి
నియంతృత్వం నుండి విముక్తి కావాలంటే ఇండియా ఫోరంకు మద్దతు ఇవ్వాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ పేర్కొన్నారు. అవినీతి, నియంతృత్వం స్వేచ్ఛకోసం ఇండియా ఫోరం సెక్యులర్‌ ప్రంట్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. జుడేగా భారత్‌, జీతేగా ఇండియా అని నినాదాలు చేశారు.
400 సీట్లు గెలిచేటట్లయితే.. అరెస్టులు ఎందుకు : అఖిలేష్ యాదవ్
తాము 400 సీట్లు గెలుస్తామని బీజీపీ నినాదాలు ఇస్తోందని.. నిజంగా 400 సీట్లు గెలిచేటట్లయితే.. కేజ్రీవాల్‌; హేమంత్‌ సోరెన్‌లను ఎందుకు అరెస్ట్‌ చేశారని సమాజ్‌ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఓటుతోనే ఈ దేశాన్ని రక్షించగలరని ప్రజలకు సూచించారు.  మీ ఓటు మాత్రమే రాజ్యాంగాన్ని, పిడిఎ (పిడిఎ-  వెనుకబడిన,  దళిత, మైనార్టీలు)  వర్గంలోని 90 శాతం జనాభా రిజర్వేషన్లను కాపాడుతుందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజీపీలు విషంతో సమానమని,  దేశాన్ని నాశనం చేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  పేర్కొన్నారు.

Spread the love