ఎమ్మెల్సీ ప్రొ.ఎం.కోదండరామ్
విద్యారంగంలో ప్రయివేటీకరణ, కాషాయీకరణను వ్యతిరేకించాలి : ప్రొ. జి.హరగోపాల్
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రభుత్వ విద్య ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఎమ్మెల్సీ ప్రొ.ఎం.కోదండరామ్ అన్నారు. ప్రభుత్వ విద్యాపరిరక్షణ కోసం ప్రగతిశీల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ”కామన్ స్కూల్ విద్యా విధానం- శాస్త్రీయ విద్య అమలు, ప్రయివేటు స్కూళ్ల రద్దు” అంశంపై రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.
ఏఐఎఫ్‌ఆర్‌టీఈ అధ్యక్షవర్గ సభ్యులు ప్రొ.జి.హరగోపాల్ మాట్లాడుతూ.. విద్యారంగంలో ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ ద్వారా పాలకులు వారి రాజకీయ ఎజెండాను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భారతదేశం లౌకిక దేశమనే ప్రాథమిక స్ఫూర్తిని విస్మరిస్తూ పాఠ్యపుస్తకాల్లో మతభావజాలాన్ని చొప్పించి, దేశభక్తి-జాతీయ వాదం పేరుతో హిందూత్వ భావజాలాన్ని తరగతి గదుల్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల కుట్రలను ప్రతిఘటించేందుకు అభ్యుదయ, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా గొంతెత్తాల్సిన అవసరం ఉందన్నారు. శ్రామిక ప్రజల ప్రజాస్వామిక సంస్కృతి, మానవీయ విలువలను పరిరక్షించే పోరాటంలో ఉపాధ్యాయ ఉద్యమం ముందువరుసలో నిలవాలని పిలుపునిచ్చారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ నివేదికలో సామాజిక, మానవీయ దృక్పథంతో కూడిన విద్యా సిఫార్సులు కనిపించ లేదని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన సమాన, నాణ్యమైన ఉచిత విద్య లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్న అభ్యంతరకర అంశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. స్పష్టతలేని నూతన విద్యా విధానాన్ని విద్యార్థులపై రుద్దకుండా, ముందుగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులతో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే శాస్త్రీయ విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించేందుకు విద్యా విధానాలను రూపొందిం చాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలుగా అభివృద్ధి చేసి, అసమానతలు లేని కామన్ స్కూల్ ఆధారిత శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ.. కామన్ స్కూల్ వ్యవస్థ సాధనకు విద్యా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజా విద్యావ్యవస్థ పరిరక్షణ, ప్రభుత్వ బడుల బలోపేతం ప్రభుత్వాల ప్రాధాన్యతాంశాలుగా మారేందుకు ప్రజా ఒత్తిడి పెరగాలన్నారు. విద్యారంగంలో అప్రజాస్వామిక ఆధిపత్య పోకడ లు, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకం గా అన్ని వర్గాల ప్రజలను, యువతను, విద్యార్థు లను, మేధావులను, ప్రజాస్వామిక వాదులను, విద్యావేత్తలను సమీకరించి విశాల ప్రజాఉద్యమం నిర్మించాలన్నారు. ఈ కృషిలో టీపీటీఎఫ్ పాత్ర క్రియాశీలకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశం లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు నర్సింహారెడ్డి, ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు పి.నాగిరెడ్డి, అకాడమిక్ సెల్ కన్వీనర్ ఎం.ప్రకాష్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ విద్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



