కేంద్ర పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలి

Central jurisdiction Public problems should be solved– ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలందించాలి
– పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలి
– మూసీ ప్రక్షాళన చేయాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు
నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రజాసమస్యలను పరిష్కరించాలని, బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్‌ చేశారు. అలాగే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మౌలిక వసతులు కూడా కల్పించడం లేదన్నారు. మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించకుండా మత చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సకాలంలో స్పందించక పోవడంతో 165 మంది చనిపోయారన్నారు. ఎన్నో ఇండ్లను తగలబెట్టారని, చాలామంది నిరాశ్రయులు అయినట్టు తెలిపారు. మానవత్వం మంట కలిసేలా మహిళలపై లైంగిక దాడులు కొనసాగడం బాధాకరమన్నారు. గంగానదికి రూ.20 వేల కోట్లు కేటాయించినట్టుగా మూసీ నది ప్రక్షాళనకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం విడనాడాలని, జాతీయ హోదాను ఇచ్చి ఆ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరారు. సంస్థాన్‌ నారాయణపురం, చౌటుప్పల్‌ మండలానికి తాగు, సాగునీరు అందించాలన్నారు. మూసీనది ప్రక్షాళన కోసం గతంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బస్సు యాత్రలు, పాదయాత్రలు, ధర్నాలు చేశామని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పెరిగిన ధరలపై, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు గ్రామ గ్రామాన గ్రామసభలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి 11 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
సాయుధ పోరాటంలో సుమారు 4000 మంది కమ్యూ నిస్టులు అమరులైతే, వారి త్యాగాలను కించ పరుస్తూ బీజేపీ హిందూ, ముస్లిం కొట్లాటగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహలక్ష్మికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, దళిత బంధు, బీసీలకు రుణాలు, మైనార్టీలకు రుణాల విషయాలపై ఎన్నికలప్పుడు వచ్చే నాయ కులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు న్యాయం చేసే వారికి ఓటు వేసి గెలిపించాల న్నారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ మడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్‌, మంగ నర్సింహులు, దొనూరు నర్సిరెడ్డి, ఎస్‌ఎఫ్‌ ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నంపాట్ల కృష్ణ, సందెల శివ, ఎన్‌పీఆర్డీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుర్పంగా ప్రకాష్‌, వనము ఉపేందర్‌ పాల్గొన్నారు.

Spread the love