– ‘మహాలక్ష్మి’ రద్దీ నివారణ కోసం…
– జులైలో వెయ్యి అద్దె బస్సులు
– కండక్టర్ కారుణ్య నియామకాలు : రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
– రెగ్యులర్ ప్రాతిపదికన నియమించండి-కార్మిక సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీలో మరో 275 బస్సుల్ని కొనుగోలు చేస్తున్నట్టు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత నెలలో ఆర్టీసీలోకి 80 కొత్త బస్సులు వచ్చాయన్నారు. ఈ ఏడాది జులై నాటికి ప్రయాణీకుల సౌకర్యార్థం వెయ్యి అద్దెబస్సులు వస్తాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ స్కీం ద్వారా మహిళల ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఇప్పటి వరకు 9 కోట్ల మంది వినియోగించుకున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నదనీ, అదనపు బస్సులు వస్తే ఆ రద్దీని కొంత నివారించుగలు గుతామని బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
కండక్టర్ కారుణ్య నియామకాలు
పదేండ్లుగా కండక్టర్ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాల ద్వారా 813 మందిని కండక్టర్లుగా తీసుకోవాలని నిర్ణయించినట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ (కారణ్య నియామకాలు), మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి లేదా పిల్లలకు వారి విద్యార్హతల ప్రకారం ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఈ నియామకాల ద్వారా హైదరాబాద్ (66), సికింద్రాబాద్ (126). రంగారెడ్డి (52), నల్గొండ (56), మహబూబ్‌నగర్ (83), మెదక్ (93), వరంగల్ (99), ఖమ్మం (53), అదిలాబాద్ (71), నిజామాబాద్ (69), కరీంనగర్ (45) రీజియన్ల నుంచి మొత్తం 813 కండక్టర్ పోస్టులను సంస్థ భర్తీ చేస్తామని తెలిపారు.
రైలు ప్రమాదంపై మంత్రి పొన్నం విచారం
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాల పై ఆయన అధికారులతో ఆరా తీశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని సూచించారు.