పీవీ ఆర్థిక సంస్కరణలతోనే దేశాభివృద్ది: పుట్ట మధుకర్‌ 

నవతెలంగాణ – మల్హర్ రావు
భారత దేశ మాజీ ప్రధాని, బహుబాషాకోవిదుడు,పీవీ నరసింహరావు జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ శుక్రవారం  మంథని పట్టణంలోని పీవీ కాంస్య విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన ఘనత పీవీకే దక్కిందన్నారు. అయితే పీవీ మరణిస్తే ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదని, ఆయన అంత్యక్రియలు చేయకుండా పార్థివ దేహాన్ని పూర్తిగా కాలకుండా అవమానపర్చారన్నారు. అయితే పీవీ సామాజికవర్గానికి చెందిన వారు మంథని నియోజకవర్గంలో ఆయన పేరుతో ఎదిగి అనేక పదవులు పొందారే కానీ ఏనాడు పీవీ గురించి ప్రజలకు చెప్పలేదని, కనీసం పీవీ చిత్రపటాన్ని ప్రజలకు చూపించకుండా అవమానపర్చారని విమర్శించారు. అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయులను చూపించాల్సిన బాధ్యతను గత పాలకులు తీసుకోకపోగా వారిని అవమానించారని,కానీ బీసీ సామాజికవర్గం నుంచి వచ్చిన తాను ఇక్కడ మహనీయుల చరిత్రను చాటి చెప్పడంతో పాటు మంథని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మాజీప్రధాని పీవీ నరసింహరావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర మాదేనన్నారు. కేవలం కాంగ్రేసేతరులు మాత్రమే పీవీని గౌరవించారని ఆయన గుర్తు చేశారు. డిల్లీ నుంచి గల్లీ వరకు ఒకే విధానం పాటిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ పీవీ నర్సింహరావును అగౌరపర్చిందని, డాక్టర్‌బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించిందని గుర్తు చేశారు. గాంధీ కుటుంబ ఏతర వ్యక్తి ప్రధాన మంత్రి అయితే ఏ విధంగా అవమాన పర్చిందో పీవీని చూస్తే కాంగ్రెస్‌ పార్టీ విధానం అర్థం అవుతుందన్నారు. ఈనాడు దేశం ఆర్థికంగా అభివృద్ది పథంలో ముందుకు నడువడానికి పీవీ ఆర్థిక సంస్కరణలే కారణమని ఆయన స్పష్టం చేశారు.
Spread the love