రోహిత్ ఫోన్ చేయ‌డం వ‌ల్లే కోచ్‌గా ఉన్నా: రాహుల్ ద్ర‌విడ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైన‌ల్లో విజ‌యం త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ రాహుల్‌ ద్ర‌విడ్ మాట్లాడిన ఫైన‌ల్ స్పీచ్ తాలూకు వీడియోను తాజాగా బీసీసీఐ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పంచుకుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం త‌ర్వాత త‌న‌కు మాట‌లు రావ‌ట్లేద‌ని ఆయ‌న‌ అన్నారు. ఈ విజ‌యంలో తాను భాగ‌మ‌వ్వ‌డం గుర్తుండిపోయే మెమోరీ అని చెప్పారు. జ‌ట్టు సాధించిన విజ‌యం ప‌ట్ల కుటుంబ స‌భ్యుల‌తో పాటు దేశ‌మంతా గ‌ర్విస్తోంద‌ని తెలిపారు. ఈ విజ‌యాన్ని చేరుకోవ‌డంలో ప్ర‌తి ఒక్క‌రూ అనేక త్యాగాలు చేశార‌ని ద్ర‌విడ్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విజ‌యంతో రాహుల్ ద్ర‌విడ్ కోచ్ ప‌ద‌వికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. అయితే, రోహిత్ శ‌ర్మ త‌న‌కు కాల్ చేయ‌క‌పోయి ఉంటే తాను కోచ్‌గా కొన‌సాగేవాడిని కాద‌ని ఆయ‌న డ్రెస్సింగ్ రూమ్ ఫైన‌ల్ స్పీచ్‌లో వెల్ల‌డించారు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ప‌రాజ‌యం త‌ర్వాత ద్ర‌విడ్ కోచ్‌గా త‌ప్పుకోవాల‌నుకున్నార‌ట‌. కానీ, క‌నీసం టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌ర‌కు అయినా కోచ్‌గా కొన‌సాగాల‌ని రోహిత్ శ‌ర్మ ఫోన్ చేసి అడ‌గ‌డంతో త‌న నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అందుకే ఇప్పుడు తాను కూడా ప్ర‌పంచ‌కప్ విజ‌యంలో భాగ‌మ‌య్యాన‌ని, అందుకు రోహిత్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.

Spread the love