న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. సేవా సంబంధిత అంశాలపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ)ను ఆశ్రయించే హక్కు వారికీ ఉందని తెలిపింది. రైల్వే సిబ్బందికి ప్రత్యేక సర్వీస్ రూల్స్ (సేవా నిబంధనలు) ఉన్నంతమాత్రాన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా పోరని తేల్చిచెప్పింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును కొట్టివేసింది. రైల్వే శాఖ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక అంతర్భాగమని, దేశంలోనే అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ విభాగమని సూచించింది. రైల్వే ఉద్యోగుల నియామకాలు, ప్రవర్తన, పెన్షన్ వంటి వాటి కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ, వాటి వల్ల వారి రాజ్యాంగపరమైన హోదా మారిపోదని స్పష్టం చేసింది. రైల్వే పరిపాలన విషయంలో రైల్వే బోర్డు స్వయంగా భారత ప్రభుత్వంగానే పనని చేస్తుందని కోర్టు ఉద్ఘాటించింది. ఫలితంగా, రైల్వే బోర్డు కింద చేసే సేవ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కింద చేసే సేవగా పరిగణించబడుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 309 మరియు 311లను ఉటంకిస్తూ, రక్షణ సేవలకు భిన్నంగా, కేంద్రం లేదా రాష్ట్రం కింద పౌర హోదాలో చేసే ఉద్యోగమే సివిల్ పోస్ట్ అని ధర్మాసనం పేర్కొంది. ఇందులో యజమాని-సేవకుడు సంబంధం ఉంటుంది, ఇక్కడ నియమించడం, సస్పెండ్ చేయడం, తొలగించడం, పనిని నియంత్రించడం, వేతనం చెల్లించడం వంటి హక్కులు ప్రభుత్వానికి ఉంటాయని తెలిపింది.
ఆగస్టు 1990లో జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్‌గా ఇండియన్ రైల్వేస్‌లో చేరిన బెన్సీ జాన్ దాఖలు చేసిన అప్పీల్‌పై ఈ తీర్పు వెలువడింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. బెన్సీ జాన్ అనే వ్యక్తి భారతీయ రైల్వేలో పదేండ్లకు పైగా పనిచేసి, ఆ తర్వాత 2001లో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (కేఎస్ఏబీ) లో సబ్-ఇంజనీరుగా చేరారు. ఆయన గతంలో రైల్వేలో చేసిన సర్వీసును కేంద్ర ప్రభుత్వ సర్వీసుగా పరిగణించి, బోర్డు మొదట ఆయనకు జీతనైపుణ్యాల వెయిటేజీ ప్రయోజనాలను కల్పించింది. అయితే, కొన్నేండ్ల తర్వాత బోర్డు అంతర్గత ఆడిటర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రైల్వే సిబ్బందికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని, దీంతో వారిని సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించలేమని అభ్యంతరం వ్యక్తం చేశారు. అతనికి అందించిన ప్రయోజనాలను రద్దు చేసి, అదనంగా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు నిర్ణయాన్ని పూర్తిగా కొట్టివేసింది. రైల్వే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమేనని పునరుద్ఘాటించడమే కాకుండా, సదరు ఉద్యోగికి నిలిపివేసిన సర్వీస్ ప్రయోజనాలన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలని ఆదేశించింది. అలాగే సర్వీస్ వ్యవహారాలకు సంబంధించి రైల్వే ఉద్యోగులు కూడా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (సీఏటీ) ని ఆశ్రయించవచ్చని ధర్మాసనం వెల్లడించింది.
రైల్వే ఉద్యోగులు,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమే : సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -



