తొలకరి కలవరం.. జాడలేని వర్షాలు

– అదును కోసం రైతన్నలు ఎదురుచూపులు
– దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న రైతులు
– విత్తనాలు వేసినవారు ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు
వరుణుడు కరుణించక రైతులు ఆందోళన చెందుతున్నారు.ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా చిరు జల్లులే కురుస్తుండడంతో దిగాలు చెందుతున్నారు.తొలకరి పలకరింపునకు ఆకాశంవైపు చూస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటినా చినుకు కోసం రైతన్న ఆకాశం వైపు చూడాల్సి వస్తోంది.వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పటికి ఒక్క పెద్ద వర్షం రాకపోవడంతో రైతన్న ఆందోళన చెందుతున్నాడు.వారం రోజులుగా మేఘాలు ఊరిస్తున్న చిరు జల్లులకే పరిమితమవుతుంది. పూర్తిస్థాయిలో విత్తనాలు విత్తుకునేందుకు సరిపడా వర్షం కురవడం లేదు.ఇప్పటికే రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకున్నారు.మండల వ్యాప్తంగా 22,500ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తున్నట్టుగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 60 మిల్లి మీటర్ల వరకు రెండు మూడు వర్షాలు కురిస్తేనే విత్తనాలు పూర్తిస్థాయిలో వేసుకునేందుకు అదునవుంతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.పూర్తిస్థాయి వర్షం ఇప్పటి వరకు పడలేదని,అదును అయ్యేవరకు విత్తనాలు వేయకపోవడమే మేలని అధికారులు సూచిస్తున్నారు.అక్కడక్కడా కురిసిన వర్షాలకు 30 శాతం విత్తనాలను విత్తినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
విత్తనాలు కొందరి ఇంట్లో..మరి కొందరివి పొలాల్లో..
సాధారణంగా ముందస్తు వర్షాలకు రోహిణి,లేదా మృగశిర కార్తెలో వానాకాలం విత్తనాలు ప్రారంభ మవుతాయి.సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటింది. మృగశిర కార్తె సగానికి వచ్చింది. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు కొందరు ధైర్యం చేసి విత్తనాలు విత్తినా అవి మొలకెత్తుతాయో లేవో అనే ఆందోళన కనిపిస్తోంది.మరో 15 రోజులు ఇలాగే కొనసాగితే ఆరుతడి పంటలైన పెసర, మినుము, జొన్న వేయడం మంచిదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.అదును దాటకముందు వర్షాలు కురువాలని రైతులు వరుణ దేవుణ్ణి కోరుతున్నారు.
Spread the love