రాజకీయ ప్రాజెక్టుగా రామమందిరం!

Ram temple as a political project!– అదే బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రం
న్యూఢిల్లీ : ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా రామ నామ స్మరణే వినిపిస్తోంది. కనిపిస్తోంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దీనిని ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చేశాయి. అయోధ్యలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రామ మందిరాన్ని ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించాలని తహతహలాడుతున్న బీజేపీ, ఈ వేడుకను అందివచ్చిన అవకాశంగా మార్చేసుకుంటోంది. తద్వారా ప్రాచీన లౌకిక సంస్కృతిని నీరుకారుస్తోంది.
ఇతర వ్యవసాయాధారిత సమాజాల మాదిరిగానే మన దేశంలో కూడా మతం అనేది మన జీవితాలలో ఆంతరంగిక భాగమైపోయింది. స్వాతంత్రోద్యమానికి ముందు దేవాలయాలు వివిధ కులాల మధ్య విభజనను ప్రచారం చేసే కేంద్రాలుగా ఉండేవి. చాతుర్వర్ణ వ్యవస్థకు ప్రభుత్వాలు కొమ్ముకాసేవి. స్వాతంత్య్రానంతరమే దేవాలయాలు ప్రార్థనా స్థలాలుగా మారాయి. అంటరానివారికి సైతం ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. స్వాతంత్య్ర సిద్ధించిన 42 సంవత్సరాల తర్వాత…అంటే 1989లో అయోధ్యలో మందిరం-మసీదు వివాదం రాజుకుంది. 1992లో బాబ్రీ మసీదును మతోన్మాద శక్తులు కూల్చివేశాయి. దీంతో దేశవ్యాప్తంగా హింస, విద్వేషాలు చెలరేగాయి. బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మందిర నిర్మాణం పూర్తయి ప్రాణ ప్రతిష్టకు సిద్ధమైంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఓ రకమైన ‘హిస్టీరియా’ను సృష్టించాయి. భారత లౌకిక స్వరూపాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, దేశంలోని ఆలయాలన్నింటి పైన పెత్తనం చెలాయించేందుకు, అధికారంపై పట్టు బిగించేందుకు, ఆర్థిక వ్యవస్థపై కార్పొరేట్‌ నియంత్రణను పటిష్టవంతం చేసేందుకు కంకణం కట్టుకున్నాయి. చివరికి ఎన్‌ఆర్‌ఐలు… సంపన్న వర్గాలు సైతం దీనిని ఓ ఘన విజయంగా భావించాయి. 1947లో సాధించిన స్వాతంత్య్రం వారిని సంతృప్తి పరచడం లేదు. ఎందుకంటే అది వారి విశేష హోదాను కాపాడలేకపోయింది. మతం అనేది నిజాన్ని సూచిస్తుంది. మందిర ప్రచారం మతాన్ని పూర్తిగా విస్మరించింది.
‘సీట్రూత్‌ అండ్‌ రైజ్‌ ఫర్‌ ట్రూత్‌’ రచయిత విపిన్‌ త్రిపాఠీ అభిప్రాయం ప్రకారం… కేంద్రంలో గత పది సంవత్సరాల బీజేపీ పాలనలో మతపరమైన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రత్యర్థులను, ప్రజాస్వామిక వ్యవస్థలను అణచివేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రామ రావణ యుద్ధ సమయంలో రావణుడు తలపెట్టిన యజ్ఞాన్ని భంగం చేసేందుకు అంగదుడు, హనుమంతుడు, ఇతరులను రాముడు పంపాడని రామాయణం చెబుతోంది. అధికార వ్యామోహంతో చేసే ఏ పని అయినా పాపమే. పీడకుల అధికారాన్ని బలోపేతం చేసేందుకు నిర్వహించే మత కార్యక్రమాలకు లేదా ప్రారంభోత్సవాలకు వెళ్లడం మంచిది కాదు. మతం, మత కార్యక్రమాలను పీడకుల నియంత్రణ నుండి కాపాడాలని ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వాన్ని విపిత్‌ త్రిపాఠీ డిమాండ్‌ చేశారు.

Spread the love